చిక్కడపల్లి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): జానపద సంగీత సరస్వతిగా వింజమూరి అనసూయాదేవి నిలిచారని ప్రభుత్వ సలహాదారు డా. కేవీ రమణాచారి అన్నారు. వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి త్యాగరాయగానసభలో నెలనెలా తెలుగు వెన్నెల 152వ కార్యక్రమంగా ప్రముఖ గాయని, సంగీత దర్శకురాలు డా. వింజమూరి అనసూయాదేవి శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ జానపద కళాకారుడు కిన్నెరమెట్ల మొగులయ్యను సన్మానించిన రమణాచారి మాట్లాడుతూ జానపద సంగీతానికి అనసూయాదేవి అందించిన సేవలు ఎంతో విలువైనవని, స్ఫూర్తిదాయకమైనవన్నారు. జానపద సంగీతంలో రాణిస్తున్న నేటి తరానికి అది ఎంతో ఆదర్శంగా ఉంటుంద న్నారు. ఎనిమిదేళ్ల వయస్సులోనే జానపదసంగీతానికి, లలిత సంగీతానికి విశ్వవ్యాప్త ప్రచారం తెస్తానని చెప్పిన ధీశాలి ఆమె అన్నారు. గ్రామగ్రామాన వింజమూరి అనసూయాదేవి, సీతలు తిరిగి జానపద సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన వైనం ఎంతో స్ఫూర్తిదాయకమైందన్నారు. సాహితీవేత్త డా. ఒలేటి పార్వతీశం, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, వంశీ సంస్థల అధినేత డా. వంశీ రామరాజు, తెన్నేటి సుధాదేవి, గాయని సురేఖామూర్తి, విజయలక్ష్మి శర్మ, సుంకరపల్లి శైలజ తదితరులు పాల్గొన్నారు.