సుద్దాల, జయరాజ్‌, భాష్యం విజయసారథికి పురస్కారాలు..

పంద్రాగస్టున సీఎం చేతుల మీదుగా ప్రదానం
 
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు సాహితీ ప్రముఖులకు విశిష్ఠ పురస్కారాలను అందించనుంది. గీత రచయితలు సుద్దాల అశోక్‌తేజ, జయరాజ్‌తోపాటు సంస్కృత, తెలుగు భాషా విద్వాంసుడు భాష్యం విజయసారథి.. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఈ నెల 15న ఈ అవార్డులు అందుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
 
పాటల్లో మేటి.. అశోక్‌తేజ
హైదరాబాద్‌, ఆగస్టు13 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి, సినీ పాటల రచయితగా గుర్తింపు పొందిన సుద్దాల అశోక్‌తేజ 1954లో నల్లగొండ జిల్లా సుద్దాలలో జన్మించారు. ఈయన తండ్రి సుద్దాల హనుమంతు తెలంగాణ సాయుధ పోరాటయోధుడే కాదు.. మంచి కవి కూడా. అశోక్‌ తేజ ఇప్పటి వరకు 11 పుస్తకాలు రాశారు. సుమారు 1250 సినిమాల్లో 2,225కు పైగా పాటలు రాశారు. రెండు సార్లు నంది అవార్డు అందుకున్నారు. 2003లో ఠాగూర్‌ సినిమాలో రాసిన ‘నేను సైతం’ పాటకు జాతీయ అవార్డు పొందారు. తెలంగాణ నుంచి ఈ అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి అశోక్‌తేజ కావడం గమనార్హం. స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న అశోక్‌ తేజ.. పాటల రచయితగా తన ప్రస్థానం మొదలు పెట్టక ముందు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించారు.
 
ఆనందంగా ఉంది

నాకు లభించిన ఈ అవార్డు.. సామాజిక సాహిత్యానికి వచ్చిందని భావిస్తున్నా. సి.నారాయణ రెడ్డి నాకు ఆదర్శం. నా సాహిత్యాన్ని గుర్తించి ప్రభుత్వం అవార్డు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. తెలుగు రాష్ర్టాల్లో 150 కేంద్రాల్లో శ్రమకావ్యం పుస్తకాన్ని గానం చేయాలనే ఆలోచనలో ఉన్నా. ఇప్పటి వరకు 31 కేంద్రాల్లో గానం చేశా. 

- అశోక్‌ తేజ

 
ప్రకృతి కవి.. జయరాజ్‌
ప్రముఖ కవి, పాటల రచయిత జయరాజ్‌ మహబూబాబాద్‌ జిల్లా గుమ్మునూరులో 1964లో జన్మించారు. ప్రకృతిపై ఎక్కువగా పాటలు రాయడంతో ఆయన ప్రకృతి కవిగా పేరొందారు. ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు రచించారు. ఈయన రాసిన ‘పుస్తకాల్లో జ్ఞాపకాలు’ పుస్తకం అత్యంత ప్రజాదరణ పొందింది. తెలంగాణ పోరాటం, దళిత  సామాజికం, అక్షర ఉద్యమం, సారా ఉద్యమంతోపాటు 25 సినిమాలకు పాటలు రాశారు. అడవిలోఅన్న సినిమా కోసం రాసిన ‘వందనాలమ్మా’, దండోరా సినిమాలో రాసిన ‘కొండల్లో కోయిల పాటలు పాడాలి’ పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం జయరాజ్‌ సింగరేణి కాలనీస్‌ హై దరాబాద్‌ హెడ్‌ ఆఫీసులో సీనియర్‌ టెక్నీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
 
ప్రకృతికి వచ్చిన అవార్డు

ప్రకృతిపైనే నేను ఎక్కువగా పాటలు రాశా. ఈ అవార్డు ప్రకృతికి వచ్చిన అవార్డుగా భావిస్తున్నా. జీవితం, పాట వేరు కాదని నమ్మా.. అలాగే జీవించా. పాటకు తలమానికం తెలంగాణ. 

- జయరాజ్‌

 
సంస్కృత భాషా వారధి.. విజయసారథి

కవిగా సుపరిచితులైన భాష్యం విజయసారథి సంస్కృతంలో వెయ్యికిపైగా గ్రంథాలు రాశారు. తెలుగులో విమర్శనాత్మక రచనలు చేశారు. వరంగల్‌లోని విశ్వేశ్వర సంస్కృత ఆంధ్రా కళాశాలలో అధ్యాపకుడిగా 36 ఏళ్లపాటు విధులు నిర్వర్తించారు. అనంతరం సర్వవైదిక ఆర్గనైజేషన్‌ను స్థాపించి యజ్ఞవరాహ క్షేత్రం ఆలయాన్ని కరీంనగర్‌లో నిర్మించారు. 1936లో కరీంనగర్‌ జిల్లా చేగుర్తి గ్రామంలో విజయసారథి జన్మించారు.

ఆయన రాసిన మందాకిని, భారతభారతి, రాసకేళి, ప్రవీణ భారతం, రోచిస్మతి, విషాద లహరి, పరివాదిని వంటి పలు గ్రంథాలు పేరొందాయి. 1996లో కేకే బిర్లా ఫౌండేషన్‌ నుంచి వాచస్పతి పురస్కారం, 1994లో తిలక్‌ మహారాష్ట్ర విద్యాపీఠ్‌ నుంచి ‘ఇందరి బిహారే’ గోల్డ్‌ మెడల్‌ను అందుకున్నారు. ఆంధ్రా సారస్వత పరిషత్‌ మహాకవి అనే బిరుదును ఇచ్చింది. 1992లో అప్పటి గవర్నర్‌ కృష్ణకాంత్‌ చేతుల మీదుగా స్వర్ణకంకణం అందుకున్నారు.
 
సంస్కృతాన్ని గుర్తించారు

తెలంగాణలో సంస్కృత భాషను గుర్తించి అవార్డు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. కేసీఆర్‌ సంస్కృత భాషను గుర్తించారు. అవార్డు ఇచ్చింనందుకు ధన్యవాదాలు.

- భాష్యం విజయసారథి