మన సాహిత్యాన్ని మరుగున పడేశారు

రియల్‌ ఎస్టేట్‌పైనే ఆంధ్రావాళ్ల దృష్టి: మంత్రి హరీశ్‌

సిద్దిపేట: ఆంధ్రా పాలకులు ఎంత సేపూ హైదరాబాద్‌ చుట్టూ రియల్‌ ఎస్టేట్‌లు చేయడం, పదవుల కోసం పాకులాడారే తప్ప ఏ రోజూ తెలంగాణ చరిత్ర గురించి ఆలోచించలేదని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఘనకీర్తి కలిగిన తెలంగాణ చరిత్రను మరుగున పడేశారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా నియమితులైన నందిని సిధారెడ్డికి శనివారం రాత్రి సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆత్మీయ సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 34 ఏళ్ల నుంచి తెలంగాణ సాహిత్య చరిత్ర గురించి ఎవరూ ఆలోచించలేదని, సాహిత్య ప్రియుడైన మన సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ చరిత్రకు మంచి రోజులు వచ్చాయన్నారు. ఉద్యమంలో వెన్నుదన్నుగా ఉన్న సాహిత్యానికి పునరుజ్జీవం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ అకాడమీకి పురుడు పోశారని పేర్కొన్నారు. దీనికి సిధారెడ్డిని చైర్మన్‌గా నియమించడం ఇంకా గొప్ప విషయన్నారు. సిధారెడ్డి ఎంపికతో అకాడమికే కొత్త వన్నె వచ్చిందని కొనియాడారు. అత్యంత నిరాడంబరత కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు. తనకు ప్రిన్సిపల్‌గా పదోన్నతి వచ్చి, బదిలీ అయినా, ఆ పదోన్నతిని వద్దనుకొని వచ్చి సిద్దిపేటలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. సిధారెడ్డి ఆధ్వర్యంలోనే ప్రపంచ తెలుగు మహా సభలు కూడా జరగనుండడం మన సిద్దిపేటకు నిజంగా గర్వకారణమని చెప్పారు. 34ఏళ్ల నుంచి మరుగునపడ్డ సాహిత్యానికి జవసత్వాలు తీసుకురాగలిగే ఏకైక వ్యక్తి సిధారెడ్డేనని హరీశ్‌ స్పష్టం చేశారు. నందిని సిధారెడ్డి మాట్లాడుతూ సాహిత్యంలో ఉన్నత శిఖరాలు అందుకోవడమే తన లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్‌తో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. ఈ కార్యక్రమంలో సీఎంవో ఓఎ్‌సడీ దేశపతి శ్రీనివాస్‌, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్‌ సోలిపేట రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.