హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): ‘‘మాసాల్లో ధనుర్మాసం, పూలలో మల్లెపూలు ఎంత విశిష్టమైనవో, కళలో విశ్వనాథుడు అంత విశిష్టమైనవాడు.. కళాలోకానికే ఆయన నాథుడు’’ అని ప్రశంసించారు. ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ ఇ.ఎస్.ఎల్‌. నరసింహన్. సాధారణంగా ఒక సినిమాను హీరో లేదా హీరోయిన్ సినిమా అని చెబుతారనీ, కానీ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన సినిమాను ఆయన సినిమాగా చెబుతారనీ, అది విశ్వనాథ్‌ దర్శకత్వంలోని గొప్పతనమనీ ఆయన అన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఇటీవల దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం అందుకున్న కళాతపస్వి కె. విశ్వనాథ్‌ను తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఆధ్వర్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ ‘కళా కార్మికునికి చిత్రసీమ ప్రణామమ్‌’ పేరుతో సత్కరించింది. శనివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి గవర్నర్‌ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరై, విశ్వనాథ్‌ను సత్కరించారు. నరసింహన మాట్లాడటానికి ముందు కార్యక్రమానికి హాజరైన దర్శకుడు యస్‌.యస్‌. రాజమౌళి, జ్యోతి ప్రజ్వలన చేసి, కొంతసేపుండి వెళ్లిపోయారు. తన ప్రసంగంలో ఈ విషయాన్ని నరసింహన్ ప్రస్తావించారు. ‘‘దురదృష్టవశాత్తూ రాజమౌళి వెళ్లిపోయారు. లేకపోతే ఇదే వేదికపై, ఇదే హైదరాబాద్‌లో, ఇదే భూమిలో ఇద్దరు బాహుబలులు కనిపించేవారు’’ అని ఆయనన్నారు.