ఐదు దశాబ్దాల పాటు ఆలిండియా రేడియోలో సేవలు

హైదరాబాద్‌సిటీ(ఆంధ్రజ్యోతి): నిన్నటితరం గాయకుడు, సంగీత దర్శకుడు కొండా బాబూ కృష్ణమోహన్‌ రాజు మరణించారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎల్బీ నగర్‌లోని తన కుమారుడి నివాసంలో శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. విజయవాడలో 1934 మార్చి 23న జన్మించిన ఆయన.. ఐదు దశాబ్దాల పాటు ఆలిడియా రేడియోలో గాయకుడిగా పనిచేశారు. అనంతరం దూరదర్శన్‌లో పనిచేశారు. పూలరంగడు, విధివిలాసం, దేవుడమ్మ, తహసీల్దారు గారి అమ్మాయి. ఇన్‌స్పెక్టర్‌ భార్య తదితర సినిమాల్లో వందకుపైగా పాటలు పాడారు. పలు సినిమాలకు సంగీత దర్శకత్వం కూడా వహించారు. హిందీ, తెలుగు పాటలు ఆలపిస్తున్న ఈ తరం గాయని వీణారాజు ఆయన మనవరాలు. ఆయన అంత్యక్రియలు శనివారం అంబర్‌పేట శ్మశాన వాటికలో జరుగుతాయని కుమారుడు మదన్‌మోహన్‌కొండా తెలిపారు.