ఆశుకవిత్వం చెప్పడంలో దిట్ట 

ఆర్‌ఎంపీ (రెడీమేడ్‌ పొయెట్‌)గా ప్రసిద్ధి

కరీంనగర్‌ కల్చరల్‌, జనవరి 12 :పూర్వ కరీంనగర్‌ జిల్లా మంథనికి చెందిన రావికంటి రామయ్య సహజ కవి. శతక సాహిత్యం పేరిట ముద్రించిన పాఠంలో ప్రాచీన కవుల సుమతీ శతకకర్త బద్దెన, దాశరథీ శతకకర్త కంచెర్ల గోపన్న, నరసింహ శతకకర్త శేషప్ప కవి, వేమన శతకకర్త వేమనల సరసన ఆధునిక కవుల్లో పూర్వ కరీంనగర్‌ జిల్లా మంథనికి చెందిన రావికంటి రామయ్యగుప్తకు చోటు కల్పించారు. 
 
సహజకవి 
సరళమైన పదాలతో పామరులకుసైతం అర్థమ య్యే భాషలో ఆశువుగా కవిత్వం చెప్పడం రామ య్యగుప్త ప్రత్యేకత. 40ఏళ్లు ఉపాధ్యాయుడిగా సేవలందించిన ఆయన వృత్తిలో, ప్రవృత్తిలో కవిత్వం కలిసిపోయింది. నీతి, నిజాయతీ, నిర్భీతి, నిర్మోహమాటం ఆయన పద్యాల్లో, గేయాల్లో కనిపిస్తాయి. వేమన పద్యాల్లోని తీయదనం, సూటిదనం రావికంటి పద్యాల్లో గమనించవచ్చు. కల్లగాదు రావికం టి మాట అన్న పద్యపాదం మంత్రపురి ప్రాం తంలో విశ్వదాభిరామ వినురవేమ అన్న రీతిలో ప్రతిధ్వనిస్తుంటుంది. నగ్నసత్యాలు పేరుతో శతకాన్ని వెలువరించిన ఆయన శతకంలో పేరుకు తగ్గట్టే అన్ని చేదు నిజాలు, కఠిన వాస్తవాలు, చురకలు వన్నెతెచ్చాయి. ఆయనను ఆర్‌ఎంపీ అని కూడా అంటారు. ఆర్‌ఎంపీ అంటే రెడీమేడ్‌ పొయెట్‌ అని అర్థం. అప్పటికప్పుడు అశు కవిత్వం వినిపించడమే ఆయనకకు ఆర్‌ఎంపీ అన్న పేరు తెచ్చింది. జీవిత చరమాం కంవరకు కవితావ్యాసాంగం చేసిన ఆయ న కులదైవం వాసవీమాత జీవిత చరిత్రను గేయరూపంలో వాసవీగీతగా వెలువరించగా అది రాష్ట్రవ్యాప్తంగా అన్ని కన్యకాపరమేశ్వరీ ఆలయా ల్లో ఇప్పటికీ మారుమోగుతుంది. ఆయనను ఆర్యవైశ్య సంఘ ఆస్థాన కవిగా, ఉపాధ్యాయ సంఘం ఆర్జిత కవిగా గౌరవించారు. ఆయన రాసినగౌతమేశ్వర శతకం, ఇందిరా విజయగీతి, కన్యకాపరమేశ్వరీ శతకం, వరహాల భీమన్న బుర్రకథ, వరద గోదావరి ఉయ్యాలపాట, గీతామృతం వంటి పుస్తకాలు ఇప్పటికీ ప్రజల నోళ్లలో నానుతున్నాయి. పద్యాలు, శతకాలతోపాటు రామయ్యగుప్త నల్లాల భాగోతం, రామగుండం-రాత్రిగండం వంటి గేయా లు ప్రసిద్ధి చెందాయి. ప్రశ్నించడం, నిలదీయడం వంటి సహజ లక్షణాలున్న ఆయన అచ్చంగా ప్రజాకవి. 
 
 
ఆయన రాసిన కొన్ని పద్యాలు...
 
తెలుగుపై...
వీధివీధిన కాన్వెంట్‌ విస్తరించే...
మనదు సంస్కృతి ఏనాడో మంటగలిసే
మమ్మీ, డాడీల చదువులే మనకుయుండే
కరుణజూపించు మంథెన్న కన్యకాంబ
 
తల్లిభాషను మరిచిన పిల్లలంత
ఎన్ని భాషలు నేర్చిన ఏమి ఫలము
గాలిలోపల మేడలు కట్టినట్లు 
కరుణ జూపించు మంథెన్న కన్యకాంబ
 
దుర్వ్యసనాలపై...
కమ్మలాట లాడు క్లబ్బు లెక్కువ పెర్గె
రమ్మీయాట రాని తమ్ములేరి
యిల్లుగుల్లచేయు యిస్పేటు ఆటరా
కల్లగాదు రావికంటి మాట.
 
కులమతాలపై...
హిందుక్రైస్తవీయ ఇస్లాము మతములు
గతులు వేరుగాని గమ్యమొకటే
వేరువేరు నదులు చేరవా సంద్రమ్ము
కల్లగాదు రావికంటి మాట
 
లంచాలు-పైరవీలపై...
చిట్టియున్న పనులు చిత్రము నెరవేరు
చేయ తడుప పనులు జల్ది అగును
రుద్రుభూమి కైన రుక్కయె కావాలి
కల్లగాదు రావికంటి మాట