రవీంద్రభారతి, హైదరాబాద్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): భారతీయ శాస్త్రీయ, సంప్రదాయ కళలు ప్రపంచంలోనే అత్యున్నతమైనవని తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ అన్నారు. నాట్యంతో శరీరంలోని అన్ని అవయవాల కదలికలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. గురువారం రవీంద్రభారతిలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సహకారంతో నటరాజ్‌ అకాడమీ 9వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణ కల్చరల్‌ ఫెస్ట్‌ శీర్షికన జరిగిన ఈ వేడుకలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్వామిగౌడ్‌ మాట్లాడుతూ విదేశాలలో స్థిరపడిన భారతీయులు ఇక్కడి కళల పట్ల అభిరుచితో కూచిపూడి, భరతనాట్యంలో శిక్షణ పొందడం అభినందనీయమన్నారు. కళలను, కళాకారులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. చిన్ననాటి నుంచే పిల్లలకు కళల పట్ల మక్కువ పెంచేలా తల్లిదండ్రులు కృషి చేయాలని సూచించారు. అమెరికా నుంచి విచ్చేసి నృత్య ప్రదర్శన చేసిన ఐశ్వర్యసాయి, శ్రీయలను స్వామిగౌడ్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, గాదె ఉపేందర్‌, అరవింద్‌ కపాట్కర్‌, డా.శ్రవణ్‌కుమార్‌, శ్యాంసుందర్‌మూర్తి, పాపిరెడ్డి, ఎస్‌.ఎన్‌.చారి, ఆర్‌.సైదులు, పుష్పలత, దైవజ్ఞశర్మ, గిరి తదితరులు పాల్గొని డల్లాస్‌-అమెరికాకు చెందిన వేణుభాగ్యనగర్‌, ఐశ్వర్యసాయి, శ్రీయ లకు బాలరత్న పురస్కారం, శారదా సింగిరెడ్డిని కళారత్న పురస్కారంతో సత్కరించారు.