సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి 

వినుకొండ,గుంటూరు: నటులకు, కళాకారులకు నాటకరంగం పునాది వంటి దని సినీ హాస్యనటుడు జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని నందమూరి అభిమానుల కార్యాలయం నందు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాటకరంగం ద్వారానే సినీ పరిశ్రమలోకి ప్రవేశించి ఇంతటి పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నానన్నారు. తల్లి లాంటి నాటకరంగాన్ని బతికించుకునేందుకే తాను నటుడిగా తీరికలేకుండా ఉన్నా నాటకాల ను ప్రదర్శిస్తున్నానని తెలిపారు. అలెగ్జాండర్‌ అనే నాటకాన్ని తాను ఇప్పటికే గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చానన్నారు. ప్రత్యేకించి ఈ నాటకంలో తాను ఒక్కడినే పా త్రధారిని అని నాటకం మొత్తం 100నిమిషాల పాటు తానే భిన్నమైన పాత్రలను పోషిస్తానన్నారు.

 సమరసింహారెడ్డి తనకు బ్రేక్‌నిచ్చిందని, తరువాత తాను వెనక్కు చూసుకునే పనిలేకుండా వివిధ రకాల పాత్రలతో ప్రేక్షకులను మెప్పించానన్నారు. తనకు దాసరి నారాయణరావు, రామానాయుడు ఎంతో అండదండలు ఇచ్చారని వారికి జీవితాంతం రుణపడి ఉం టానన్నారు. అలెగ్జాండర్‌ నాటకం ఇప్పటికే పూర్తిస్థాయిలో విజయవంతమైందని, 100 ప్రదర్శనలు ఇవ్వాలనే లక్ష్యంతో గుంటూరు జిల్లాలోని నియోజకవర్గాల్లో సైతం ప్రదర్శనలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నానన్నారు. ఇందులో భాగంగానే మే 28వ తారీఖున స్వర్గీయ ఎన్‌టీ రామారావు జయంతిని పురస్కరించుకొని వినుకొండలో అలెగ్జాండర్‌ నాటకాన్ని ప్రదర్శిస్తున్నానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ లగడపాటి వెంకట్రావు, సినీనిర్మాత లగడపాటి శ్రీనివాసరావు, బొగ్గరం బాచి, గంగవరపు చందారావు, వాసిరెడ్డి హనుమంతరావు, వంకాయలపాటి పేరయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.