చిక్కడపల్లి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): తెల్లదొరలపై నిరసన తెలిపి మహాత్మాగాంధీ అభినందనలు అందుకున్న గొప్ప వ్యక్తి గరిమెళ్ల సత్యనారాయణ అని సాహితీవేత్త డా. ఓలేటి పార్వతీశం అన్నారు. ప్రముఖ సాహితీవేత్త గరిమెళ్ల సత్యనారాయణ జయంతి సభ ఆదివారం త్యాగరాయగానసభలో జరిగింది. ఈ సందర్భంగా ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ జాతిని ఉత్తేజితం చేసే గానం సత్యనారాయణ సొత్తు అని అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో సత్యనారాయణలాగా గీతం రాసి గొంతెత్తి పాడాలని ఇతర రాష్ట్రాల గాయకులకు తెలిపారని, ఆ రకంగా గాంధీ అభినందనలు అందుకున్నారన్నారు. మాకొద్దీ తెల్లదొరతనం అని గరిమెళ్ల రాసిన పాట గాంధీని ఎంతో ఆకట్టుకొందన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్‌ ఆచార్య టి.గౌరీశంకర్‌ మాట్లాడుతూ గరిమెళ్ల సత్యనారాయణ గొప్ప దేశభక్తుడని అన్నారు. మాకొద్దీ తెల్లదొరతనం అనే గీతాన్ని 160 పంక్తులో సత్యనారాయణ రాయగా అప్పటి తెల్లదొరల కలెక్టర్‌ ఆ పాటను పాడించుకుని తమకు ముప్పు తెచ్చేలా ఉందని గరిమెళ్లను ఏడాదిపాటు జైలులో పెట్టించారన్నారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, గాయకుడు జీఎస్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.