రవీంద్రభారతి,హైదరాబాద్: ప్రజాకళలకు అంతర్లీనమైన ప్రాణం పాట అని, ఆ పాట ప్రజాకళలకు సూత్రరూపంగా, వాహికగా పనిచేస్తుందని, ఎల్ల సాహిత్యాలకు తల్లి జానపదమని ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పాటు జరుగుతున్న జాతీయ నృత్యోత్సవాలలో భాగంగా బుధవారం జరిగిన విద్యాత్మక సదస్సులో ‘‘తెలంగాణ ప్రజాకళలు’’ అనే అంశంపై మాట్లాడారు. ప్రపంచంలోని ప్రతి భాష రాగ సంబంధమైనదని, ఆది మానవుడి తొలి పలుకు పాటతోనే ప్రారంభమైందని అన్నారు.
 
శ్రమ నుంచి లయాత్మకమైన గానం ఉద్భవించిందని, అది గేయంగా రూపాంతరం చెందిందని, క్రమేణా ప్రజాకళలలో రాణించిందని తెలిపారు. తెలంగాణలో అంతరించిపోతున్న అరుదైన జానపద కళారూపాలకు సంబంధించిన వస్తు సామగ్రిని సేకరించి ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ‘‘నాట్యగ్రంథాల్లో దేశీ ప్రస్తావన’’ అనే అంశంపై కేంద్రీయ విశ్వవిద్యాలయం నృత్యశాఖాధిపతి ఆచార్య జొన్నలగడ్డ అనురాధ మాట్లాడుతూ 11వ శతాబ్దం నుంచి 19వ శతాబ్ధం వరకు నాట్యం, నృత్యం వివిధ దశలలోని పరిణామక్రమాన్ని వివరించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ఉత్సవాలను మరిన్నినిర్వహి స్తామ ని అన్నారు. సదస్సులో పత్రసమర్పణ చేసిన ప్రముఖులను ఘనంగా సత్కరించారు. తెలుగువర్సిటీ రిజిసా్ట్రర్‌ ఆచార్య సత్తిరెడ్డి స్వాగతవచనం పలికారు.