రవీంద్రభారతి, సెప్టెంబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): ప్రతిభను గుర్తించి వచ్చే పురస్కారాలు సామాజిక బాధ్యతను మరింత పెంచుతాయని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ అన్నారు. శనివారం రవీంద్రభారతిలో ఢిల్లీ తెలుగు అకాడమీ, రావాడా ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తధిగిణతోమ్‌ శీర్షికన 500మంది కళాకారులతో ప్రత్యేక నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహమూద్‌అలీ పురస్కారగ్రహీతలు గొర్ల మల్లికార్జున్‌, డా.ఎ్‌స.జగన్మోహన్‌రెడ్డి, ఆర్‌.హైమారావు, కుతాడి శ్రీనివాస్‌లను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారిని గుర్తించి గౌరవించుకోవడం అభినందనీయమన్నారు.

విశిష్ట అతిథిగా హాజరైన జస్టిస్‌ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఢిల్లీ తెలుగు అకాడమీ గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కళాకారులను ప్రోత్సహించడంతో పాటు ప్రతిభకు పట్టం కట్టడం అభినందనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి మాట్లాడుతూ తెలుగు ప్రతిభను జాతీయ స్థాయిలో చాటుతున్న ఢిల్లీ తెలుగు అకాడమీ సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డా.ఎన్‌.వి.ఎల్‌.నాగరాజు, రావాడ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.