ఎన్టీఆర్‌ స్టేడియంలో 11 రోజుల పాటు నిర్వహణ

హైదరాబాద్‌ సిటీ, జనవరి17(ఆంధ్రజ్యోతి): పుస్తక ప్రియులకు ఇక పండుగే! హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో గురువారం నుంచి జాతీయ పుస్తక ప్రదర్శన జరుగనుంది. తెలంగాణ భాషా, సంస్కృతిక, పర్యాటక శాఖల సహకారంతో 11 రోజుల పాటు జరిగే ఈ బుక్‌ఫెయిర్‌లో మొత్తంగా 333 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇందులో బాలల సాహిత్యానికి సంబంధించి ప్రత్యేకంగా 50 స్టాళ్లను కేటాయించారు. ఈ మేరకు పుస్తక ప్రదర్శన సంఘం అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌ వెల్లడించారు.ప్రతిరోజూ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 8.30 వరకు.. శని, ఆదివారాల్లో మధ్యా హ్నం 12.30 నుంచి రాత్రి 8.30 వరకు బుక్‌ఫెయిర్‌ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ప్రదర్శనను తిలకించడానికి వచ్చే వారి నుంచి రూ.5 ప్రవేశ రుసుముగా వసూలు చేస్తామన్నారు. ఈసారి పుస్తక ప్రదర్శనకు 12 లక్షల మంది దాకా వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను రాష్ట్ర పర్యాటక కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పరిశీలించారు.