కథలు చదవడం వల్ల పిల్లల ఊహాశక్తి పెరుగుతుందంటారు. అయితే తెలుగులో అటువంటి బాలసాహిత్యం చాలా తక్కువే వస్తోందని చెప్పాలి. ఆ కొరతను కొంతమేర తీర్చడానికి ‘మంచిపుస్తకం పబ్లిషర్స్‌’ వారు ఏడు పుస్తకాలను వెలువరించారు. 

నీలపు దీపం

జానపద కథలలో గొప్ప కల్పన ఉంటుంది. మన జానపద కథలన్నీ పిల్లలకు ఇంట్లో పెద్దవాళ్ల ద్వారానో టీవీలలో కార్టూన్ల రూపంలోనో తెలుస్తూనే ఉంటాయి. కానీ ‘విదేశీ జానపద కథల మాటేమిటి ..?’ అంటే భాషాపరమైన ఇబ్బందుల వల్ల అవి అందరికీ పెద్దగా అందు బాటులో ఉండకపోవచ్చుననే చెప్పాలి. ఎంతో కొంతమేర ఆ కొరత ‘నీలపుదీపం’ ద్వారా తీరుతుంది. సుప్రసిద్ధ సిండ్రెల్లా కథ లాంటి ‘మసిబొగ్గు’, అల్లావుద్దీన్‌ అద్భుతదీపం కథను పోలిన ‘నీలపు దీపం’ వంటి కథలు, మోసగాడైన దొంగపెళ్లికొడుకును తెలివిగా బుద్ధి చెప్పిన పెళ్లికూతురు కథ ‘పాపం! పెళ్లికొడుకు!’ వంటి కథలు పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఆసక్తికరంగా ఉంటాయి.

నీలపు దీపం - గ్రిమ్స్‌ సోదరులు

అనువాదం: ఊట్ల కొండయ్య, వెల: రూ. 65,  పేజీలు : 127 

మూడు కోరికలు

ఈ సంకలనంలోని పాత్రల పేర్లు, ప్రాంతాల పేర్లు విదేశీ పేర్లు కావడంతో పరదేశీ కథల్లా అనిపించినా ప్రేమ, జాలి, హాస్యం వంటి భావనలు ప్రపంచంలో ఎక్కడైనా ఒకేలా ఉంటాయి కాబట్టి భాషాపరంగా పెట్టే ఇబ్బంది పెద్దగా పట్టించుకో దగినది కాదు. ‘ఛెల్మ్‌’ అనే ఊరిలో ఉండే అమాయక ప్రజలు, తమకంటే అమాయకపు గ్రామ పెద్దల చుట్టూ తిరిగే ఈ హాస్య కథలు నవ్విస్తాయి. గ్రామపెద్దల పేర్ల చివర ఎద్దు, గాడిద, దద్దమ్మ వంటి బిరుదులుండడంతో పిల్లలకు ఇవి గిలిగింతలు పెడతాయి.

మూడు కోరికలు, మరికొన్ని కథలు
రచన : ఐజక్‌ బషేవిన్‌ సింగర్‌, అనువాదం : కె.బి.గోపాలం

వెల: రూ. 60, పేజీలు : 112

ఆనందలోకం
ఇది నవలే అయినా రాజకుమారుడు దేశాటనకు బయలుదేరి వివిధ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరిస్తూ సాగే కథ కావడంతో ఎన్నో గమ్మత్తు కథల సమాహారంగా దీన్ని చదువుకోవచ్చు. సందర్భోచితంగా రచయిత చొప్పించిన నీతి వాక్యాలు పిల్లల వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. అద్భుతదీవి, మాంత్రికుడు, మరుగుజ్జు, గంధర్వుడు, మునులు, కరుటమంత్రి .. ఇలా ఒకటేమిటి పిల్లలు ఊహాలోకంలో విహరించడానికి కావలసిన అంశాలెన్నో ఉన్నాయి ఇందులో.

ఆనందలోకం (జానపద నవల)

నారంశెట్టి ఉమామహేశ్వరరావు, వెల: రూ. 60, పేజీలు : 128

 

ఒక వేసవి రోజు

గౌతం తన తండ్రితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఎదురైన ప్రమాదకర పరిస్థితి, దానిని అతడు సమయస్ఫూర్తితో సాహసోపేతంగా ఎదుర్కోవడం వంటి విషయాలతో ఉద్విగ్నంగా సాగుతుంది మొదటికథ. ‘క్రియాకలాపం’ అనే రెండో కథలో చిన్మయి అనే అమ్మాయి ఒక సెలవురోజున వ్యాసం రాయవలసి వస్తుంది. ఆ క్రమంలో బాధ, మరణం వంటి మనస్సును ద్రవింపచేసే అంశాలతో పాటు కాస్త తమాషా కూడా ముడిపడి ఆసక్తిగా సాగుతుందీ కథ. ఈ రెండు కథలూ ప్రస్తుత జీవనశైలిలో సాగడం వల్ల పిల్లలను బాగా ఆకట్టుకోవచ్చు.
ఒక వేసవి రోజు,  మాధురి పురందరే
అనువాదం: కె.సురేష్‌, వెల: రూ.50, పేజీలు : 86

 

చిచ్చర పిడుగులు

నిధులు సంపాదించడం, అపరాధ పరశోధన (డిటెక్టివ్‌), తెలివితేటలతో, ధైర్య సాహసాలతో ప్రమాదాలను ఎదుర్కోవడం వంటి కథలంటే పిల్లలు చెవికోసుకుంటారు. అటువంటి విషయాలతో కూడినదే ఈ నవల. ఇందులోని కథ దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం అమెరికా నేపథ్యంలో సాగుతుంది కాబట్టి కొన్ని విషయాలు పిల్లలు అర్థం చేసుకోవడంలో సంక్షిష్టత ఉన్నా అవేవీ పెద్ద అడ్డంకులు కాదు. పిల్లలు బుద్ధిగా ఉండాలని చెప్పే పంచతంత్రం, చందమామ కథలు అలవాటైన మనకు ఈ నవలలోని గడుగ్గాయిల దుడుకు పనులు, దొంగల్లా ముఠా కట్టడం వంటి వ్యవహారాలు కాస్త కొరుకుడుపడవు.

చిచ్చర పిడుగులు (హకల్‌ బెరీ ఫిన్‌ సాహసాలు) 

రచన: మార్క్‌ట్వేన్‌, అనువాదం : ఎమ్‌.వి.వి.సత్యనారాయణ

వెల: రూ.60, పేజీలు : 110

 

మొయిన్‌, రాక్షసుడు
మొయిన్‌ అనే పిల్లవాడి మంచం కిందకు ఒకరోజు ఒక రాక్షసుడు రావడం, ఆ రాక్షసుడు తానెలా ఉంటాడో వర్ణిస్తూ మొయిన్‌ను బొమ్మ గీయమనడం, మొయిన్‌ విచిత్రంగా గీసిన ఆ బొమ్మలాగ రాక్షసుడు మారిపోవడం, బొమ్మగీసిన వ్యక్తితోనే ఆ రాక్షసుడు ఉండిపోవాలన్న నియమం - దాని వల్ల మొయిన్‌కు ఎదురయ్యే పరిస్థితులు, రాక్షసుణ్ణి వదిలించుకోవడానికి మొయిన్‌ చేసే ప్రయత్నాలు, రాక్షసుణ్ణి దాచిపెట్టడానికి పడే ఇబ్బందులు కడుపుబ్బా నవ్విస్తాయి.
మొయిన్‌, రాక్షసుడు, అనుష్కా రవిశంకర్‌, 
అనువాదం: కె.సురేష్‌, వెల: రూ. 100, పేజీలు : 106

 

జతగాళ్లు, కతగాళ్లు

ఈ కథా సంకలనంలోని కథలన్నీ ఇద్దరు స్నేహితులు (సూరిగాడు, మునిగాడు) చెప్పుకునే కథలుగా గొలుసు కట్టుగా సాగుతాయి. పల్లె వాతావరణం, ఒకింత భావుకత కూడా తొంగిచూసే ఈ కథలు చక్కటి చమత్కారంతో ముగుస్తాయి. మాట్లాడే వంకాయ, తెలివైన నక్క, యమునికి సహాయం చేయడానికి యుక్తిగా వ్యవహరించే గొర్రె వంటి ఎన్నో పాత్రలున్న కథలు ఇవి. అపాయాలనుంచి తప్పించుకునే ఉపాయాలు, కుయుక్తులను చిత్తు చేసే యుక్తులు, చెడుపై మంచి సాధించే విజయం వంటి విషయాలతో ముడిపడే ఈ కథలు పిల్లలను బాగానే ఆకట్టుకుంటాయి.
జతగాళ్లు, కతగాళ్లు (హోసూరు కతలు) కె.మునిరాజు, 
గౌనోళ్ల సురేష్‌రెడ్డి, వెల : రూ.55, పేజీలు : 120