నాన్న ఒక వైపు.. దేవతలంతా ఒక వైపు..
 
నాన్న... చిన్నప్పుడు చిటికెన వేలు పట్టుకొని నడిపించిన... బాంధవ్యం పెద్దవుతున్నప్పుడు వెన్నంటి ధైర్యమిచ్చిన... భరోసా ఎంత ఎదిగినా... ప్రతి అడుగులో గుర్తొచ్చే మాటల... మార్గదర్శి ప్రతి పసిబిడ్డకూ... చేతల్లో, చేష్టల్లో ఒక సూపర్‌ హీరో... కళ్ళెదుటి సూపర్‌ మ్యాన్. ప్రతి పెద్దమనిషికీ... పెదవి దాటని ఫీలింగ్‌! జీవితాంతం... మనసు పొరల్లో తారట్లాడే బలమైన ఎమోషన్!! రోజులు, సంవత్సరాలకు అతీతంగా ప్రతి గుండె గదిలో చెరిగిపోని చోటున్న...అలాంటి నాన్నలందరికీ... ప్రేమతో...‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ఫాదర్స్‌డే స్పెషల్‌!
 
సాహితీ శిఖరం సి. నారాయణరెడ్డి మరణించారంటే మనలాంటి వాళ్లకే నమ్మ శక్యం కావట్లేదు. అలాంటిది ఆయన కుమార్తెలు ఎలా నమ్మగలరు! తాను ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవడానికి సిద్ధమవుతున్నాననే ఆనవాళ్లేమీ బయటపడనీయకుండా నిశ్శబ్దంగా వెళ్లిపోయిన ఆయన గురించి ఆ బంగారు తల్లులు ఏమంటున్నారు? వాళ్ల దృష్టిలో నాన్నగా ఆయనేమిటి? ఆఖరి శ్వాస తీసుకునే సమయంలో ఆయనతో పాటే ఉన్న ఆ నలుగురు అక్కచెల్లెళ్ల భావోద్వేగాలు ఇప్పుడెలా ఉన్నాయి? ఫాదర్స్‌ డే సందర్భంగా సినారె నలుగురు కుమార్తెలు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి.. ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్న తమ తండ్రి జ్ఞాపకాలను చదవండి...
 
నాన్నగారు లేరనే విషయం తలుచుకుంటే ఎలా అనిపిస్తోంది?

గంగ: నాన్న లేరనే నిజాన్ని భరించగలగడానికి ఇంకా టైమ్‌ పడుతుంది. పొద్దున ఐదున్నర, ఆరు గంటల నుంచి నాన్నకు కావాల్సినవన్నీ అమర్చిపెట్టడం మొదలుపెట్టేవాళ్లం. ఆరేళ్ల క్రితం వరకు వాకింగ్‌కు వెళ్లేవారు. ఆ తర్వాత లిఫ్ట్‌లో పడినప్పట్నించీ వాకింగ్‌ లేదు. సహాయకుడి ఆసరాతో ఇంట్లోనే కాసేపు అటు ఇటు నడిచేవాళ్లు. ఇటీవల అదీ తగ్గిపోయింది. నిద్రలేచి, కిందకొచ్చి కూర్చొని పాలు తాగడంతో ఆయన దినచర్య మొదలయ్యేది.

సరస్వతి: ఇంకా మాకు ఆయన ఉన్నారనే, తన రూమ్‌లో పడుకొని ఉన్నారనే.. అనిపిస్తోంది. ‘నాన్న లేచారా? పాలు ఇవ్వాలి కదా’ అనే ఆలోచనే వస్తోంది. ఆ వెంటనే ‘అవును. నాన్న లేరు కదా’ అని విపరీతమైన దిగులు వేస్తోంది. పాలతో పాటు మూడు నాలుగేళ్ల నుంచీ ఆయన చ్యవనప్రాశ కూడా తీసుకుంటున్నారు. దాని పేరు కూడా ఆయనకు గుర్తుండదు. ఒక్కోసారి దాని పేరు అడిగేవాళ్లు. రోగనిరోధక శక్తి పెరుగుతుందని అది తీసుకునేవాళ్లు. ఎప్పుడైనా పాలు మాత్రమే తెస్తే, దాన్ని అడిగి మరీ తెప్పించుకొని తినేవాళ్లు. ఆయనకు తుమ్ములు ఎక్కువగా వచ్చేవి. చ్యవనప్రాశతో అవి తగ్గిపోయేవి. దాని టేస్ట్‌ కూడా ఆయనకు నచ్చింది. మమ్మల్ని కూడా దాన్ని తినమని చెప్పేవాళ్లు.

గంగ: ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం. అన్ని విషయాలోనూ అంతే. డిప్లొమసీ అనేదే ఆయనకు తెలీదు. సాయంత్రం మూడున్నర అయితే సారస్వత పరిషత్తుకో, రవీంద్రభారతికో, లేదంటే త్యాగరాయగానసభకో.. ఏదో ఒక ప్రోగ్రామ్‌కు వెళ్లేవారు. జనవరి నుంచి వీల్‌ చెయిర్‌లో కూర్చొని కారెక్కడం, దిగడం, వేదికమీదకు వెళ్లడం కష్టమైన పనయ్యింది. దానివల్ల స్ట్రెయిన్ అవుతున్నారనే ఉద్దేశంతో మేమే వాటికి వెళ్లొద్దని చెప్పాం. ఆ కార్యక్రమాలు తగ్గించుకొని, ఒక్క సారస్వత పరిషత్తుకు మాత్రం వారానికి రెండు సార్లు వెళ్తూ వచ్చారు. ఈ నెల ఏడవ తేదీ కూడా తెలంగాణ అవతరణ ఉత్సవాలకు వెళ్లొచ్చారు కానీ అక్కడ ఏమీ మాట్లాడలేకపోయారు. నాన్న ఇంట్లో ఉంటే ఒంటరిగా ఎప్పుడూ ఉండనిచ్చేవాళ్లం కాదు. మేం బయటకు ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా, కనీసం మాలో ఒకరమైనా ఆయన దగ్గర ఉండేవాళ్లం.
 
ఈ కొత్త ఇంటికి వచ్చి ఎంత కాలమైంది?
గంగ: ఇది మా అబ్బాయి చైతన్యదేవ్‌కు మేం కట్టించి ఇచ్చిన ఇల్లు. ఫిల్మ్‌నగర్‌లోని ఇల్లు అందరికీ సరిపోవడం లేదని నాలుగు నెలల క్రితమే ఇక్కడకు వచ్చాం. వచ్చేప్పుడు నాన్నను అడిగాం.. ‘ఇలా ఇక్కడకు రావడం ఇష్టమేనా?’ అని. ‘ఇంటిమీద నాకేం సెంటిమెంట్‌! మీరెక్కడ ఉంటే అక్కడే నేను. మీకంటే ఇల్లెక్కువా?’ అన్నారు. వెంటనే ఒప్పుకున్నారు. సాధారణంగా ఆ వయసులో ఇల్లు మారడానికి ఎవరూ ఒప్పుకోరు. ఫిల్మ్‌నగర్‌ ఇంట్లో ఇరవై ఆరేళ్లు ఉన్నాం. అంతకుముందు అశోక్‌నగర్‌లో పాతికేళ్లు ఉన్నాం. ఆ ఇల్లు సరిపోకే ఇక్కడకు వచ్చాం.
 
ఆయన ఇష్టానిష్టాలు ఎలా ఉండేవి?
కృష్ణవేణి: ఆయనకు మనుషులంటే చాలా ఇష్టం. తనెంత నిజాయితీగా ఉంటారో, ఎదుటివాళ్లను కూడా అలాగే అనుకొనేవాళ్లు. అవతలి వాళ్లు ఎలాంటివారైనా లోపాలు కనిపించేవి కావు. అసలు నెగటివ్‌ థింకింగ్‌ అనేదే ఉండేది కాదు. మేం ఎవరి గురించైనా మాట్లాడుతూ వారు చేసే తప్పుల్ని ప్రస్తావిస్తే ఆయనకు నచ్చేది కాదు. ‘అలా ఆలోచించకు. వదిలేయ్‌’ అనేవారు. నెగటివ్‌గా ఎవరి గురించి చెప్పినా ఆయనకు ఇష్టం ఉండదు. ఆయన ఓపెన్ యూనివర్శిటీ లాంటివారు. మనసులో ఏదీ దాచుకోకుండా భోళాశంకరునిలా అన్ని విషయాలూ బయటకు చెప్పేస్తుంటారు. అందుకే ఆయనకు ఎలాంటి రహస్యాలూ లేవు.
గంగ: మద్రాసుకు పాటలు రాయడానికి వెళ్లే రోజుల్లో తనకు ఏవైనా ఉత్తరాలు వస్తే, వాటిని చదివి చెప్పమనేవారు. ఏ రోజు ఉత్తరాలు ఆ రోజు చూసి, చదివి ఫోన్ లో వినిపించేదాన్ని. ఎప్పుడైనా ఉత్తరాలు చింపకుండా కనిపిస్తే, ‘ఇదెందుకు చెప్పలేదు, నాకేమైనా లవ్‌ లెటర్స్‌ వస్తాయా?’ అనేవారు. ఒకవేళ లవ్‌ లెటర్స్‌ వస్తే కూడా, చింపి చదవవచ్చని అన్నారు.
 
ఆయన ఎవరితో ఎక్కువ స్నేహంగా ఉండేవారు?
గంగ: అక్కినేని నాగేశ్వరరావుగారు, గుమ్మడి వెంకటేశ్వరరావుగారు, నేరెళ్ల వేణుమాధవ్‌, జస్టిస్‌ చిన్నపరెడ్డిగారు, జస్టిస్‌ జయచంద్రారెడ్డిగారు ఆయనకు మంచి స్నేహితులు. అదివరకు విజయా డిస్ట్రిబ్యూటర్స్‌ పార్థసారథిగారు, నేషనల్‌ ఆర్ట్స్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ప్రసాద్‌గారు, మిక్కిలినేనిగారు ఎక్కువగా కలుస్తుండేవాళ్లు. ఎన్టీ రామారావుగారితో నాన్నకున్న ప్రత్యేక అనుబంధం గురించి తెలిసిందే.
 
మిమ్మల్ని ఎలా పెంచారు?
యమున: ఆయన అమ్మ గురించి ‘అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు’ అని రాసుకున్నారు కదా. అలాగే ఆయనను తలుచుకుంటే ‘నాన్న ఒకవైపు, దేవతలంతా ఒకవైపు’ అని చెప్పాలనిపిస్తుంది. మా అమ్మ 1982లోనే పోయింది. ఆమె 1962 నుంచీ పెరాలసిస్‌ పేషెంట్‌. ఇరవై ఏళ్లు పక్షవాతంతో బాగా బాధపడింది. దాని వల్ల నాన్నతోనే మాకెక్కువ అనుబంధం.
గంగ: ఆయనకు సంబంధించి ఒక్కొక్కరం ఒక్కో పని చేసేవాళ్లం. యమున హోమియోపతి డాక్టర్‌. ఆయన మెడికేషన్ అంతా తనే చూసుకుంటూ ఉంటుంది. ఆయన హాల్లోకి వస్తే కృష్ణవేణీ టీవీ పెట్టాలి. నేనొస్తే.. ‘మనకు రాదురా. కృష్ణను పిలువు’ అనేవాళ్లు.
సరస్వతి: ఒక పని ఎవరైనా చేస్తే, ఆ పనిని వారే చెయ్యాలన్న మాట. వేరే వాళ్లను ఆ పని ముట్టుకోనివ్వరు.

యమున: ఆయన ఎప్పుడూ మమ్మల్ని కోప్పడింది లేదు.

గంగ: ఐదేళ్ల వయసప్పుడనుకుంటా.. సరస్వతి చేత అక్షరాలు రాయిస్తున్నారు. తను ఎంతకీ రాయట్లేదు. దాంతో వీపు మీద ఒక్కటి వేశారు. ఆ దెబ్బతో అరగంటలో మొత్తం అక్షరాలు నేర్చుకుంది. యమున, కృష్ణవేణిని ఎప్పుడూ ఏమీ అనలేదు. పిల్లలతో పెద్దలు అన్నీ షేర్‌ చేసుకోలేరు. కానీ నాన్న మాతో అన్ని విషయాలూ చెప్పేవారు. ఇంతవరకూ తనకు సంబంధించిన ఏ విషయాన్నీ దాచిందంటూ లేదు.
సరస్వతి: మేం ఎప్పుడైనా దేనికైనా మంకుపట్టు పడితే, ‘‘ఏమైంది? ఎందుకలా చేస్తున్నారు? అలా చికాగ్గా ఎందుకున్నారు? అలా ఉండకూడదు. ప్రశాంతంగా కనిపించాలి. డల్‌గా ఉండకూడదు’’ అని చెప్పేవారు.
గంగ: మా అక్కచెల్లెళ్ల మధ్య వాదోపవాదాలు నడుస్తుంటాయి. బయటి వాళ్ల గురించి కూడా వాదించుకునేవాళ్లం. ‘‘శాంతం.. శాంతం’’ అని ఆయన ఆపేవారు. ఎవర్నీ ఏమీ అననిచ్చేవాళ్లు కాదు.
 
ఆయన అభిరుచులు మీలో ఎవరికైనా వచ్చాయా?
గంగ: మాకు కాదు కానీ, నా మనవరాలు (కూతురి కూతురు).. అంటే ఆయన మునిమనవరాలు వరేణ్యకు రాయడం అబ్బింది. ఇంగ్లీష్ లో ఎనిమిదేళ్ల వయసు నుంచే రాయడం మొదలుపెట్టింది. అది అమెరికాలో పుట్టింది కదా! సాధారణంగా పిల్లలంటే కథలు రాస్తారు. కానీ తను పొయిట్రీ రాస్తుంది.
కృష్ణవేణి: నాన్నగారికి ఎనభై ఏళ్లు నిండినప్పుడు ఇంగ్లీష్‌లో ఒక కవిత రాసి, దానికి ఫొటోలు జోడించి, లామినేషన్ చేసి, నాన్నకు గిఫ్ట్‌గా ఇచ్చింది. అప్పుడు వరేణ్యకు పదేళ్లు. గంటలో ఆ కవిత రాసేసింది. నాన్నయినా ఓసారి రాసింది, మరోసారి సరిచూసుకుంటారేమో కానీ, తను మాత్రం ఒకసారి రాసింది మళ్లీ చూసుకోదు. మార్చడానికి ఒప్పుకోదు.
గంగ: నాన్న ఏది రాసినా వెంటనే నన్ను పిలిచి, వినిపిస్తారు. నేనేమీ స్పందించకపోతే, ‘నువ్వేదో ఆలోచిస్తున్నావ్‌’ అంటారు. లేకపోతే ‘నీ మనసిక్కడ లేదు. కింద పిల్లలమీద ఉన్నట్లుంది’ అంటారు. తను చెప్పేది వినకపోతే ఆయనకు నచ్చదు. నేనెక్కడైనా ఆయన వినిపించేది ఆపమంటే, ‘ఈ పదాన్ని మార్చాలా?’ అనడుగుతారు. నాకు తోచింది చెబుతా.
సరస్వతి: నానెప్పుడైనా ‘వరేణ్యా.. నువ్వేమైనా రాశావా?’ అనడిగితే తెచ్చి చూపించేది. నాన్నేదైనా ‘ఇది మార్చాలి’ అని చెబితే, మార్చేది కాదు. అభిప్రాయాల విషయంలో అది చాలా స్ట్రాంగ్‌.
 
నాన్నగారికి ఆరోగ్య సమస్యలేవైనా ఉన్నాయా?
యమున: లిఫ్ట్‌లో పడినప్పట్నించే ఆయనకు ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. అదివరకే మధుమేహం ఉన్నా, కంట్రోల్‌లోనే ఉండేది. గుండెకు సంబంధించిన సమస్యలేవీ ఆయనకు లేవు. తలనొప్పులు, కడుపునొప్పులు తెలీవు. తుమ్ములు బాగా ఉండేవి.
గంగ: మాకు ఊహ తెలిసినప్పట్నించీ నాన్నకు అదొక్కటీ ఉండేది. నాన్న నుంచి నాకొచ్చిన వారసత్వం అదొక్కటే. పోటీపడి తుమ్మేవాళ్లం.
కృష్ణవేణి: నాన్నకు అదివరకు జ్వరం రావడం చూడలేదు. చనిపోకముందే జ్వరం కనిపించింది. 102 డిగ్రీల దాకా వచ్చింది. సాయంత్రానికి తగ్గింది.
యమున: నాన్న తన మందులు తను వేసుకునేవారు కాదు. మేం చేతికిస్తేనే వేసుకొనేవారు. ఆయన లేరనే భావనలోనే మేం లేము.
గంగ: నాన్నకు కారం అంటే ఇష్టం ఉండదు. మసాలాలు తినరు. అందుకే పిల్లలకూ, నాన్నకూ ఒకే వంట. మిగతా వాళ్లది ఇంకో వంట. అందుకే అంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకొనే నాన్న అప్పుడే ఎలా మమ్మల్ని విడిచిపెట్టి పోయారా.. అనిపిస్తోంది.
 
ఆయన ఆహారపుటలవాట్లు ఎలా ఉండేవి?
గంగ: నాన్నకు నాన్ వెజ్‌ బాగా ఇష్టం. ఊళ్లో ఉన్న కాలంలో ఇంట్లోనే కోళ్లు పెంచేవాళ్లు కాబట్టి, వాటిని కోసేవారంట. ఒక్క శనివారం మినహా మిగతా రోజుల్లో నాన్ వెజ్‌ ఉండేది. అమ్మకు శనివారం పట్టింపు ఉండేది. ఆమె పోయిన తర్వాత కూడా ఆమె కోసం నాన్న ఆ రోజు మాంసాహారం ముట్టుకొనేవారు కాదు. నాన్నకు కానీ, మాకు కానీ మురుకులు, మిక్చర్‌లు వంటివి తినడం అలవాటు లేదు. ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకొనేవారు.
సరస్వతి: ఒక్క పప్పుగారెలు మాత్రం ఇష్టంగా తినేవారు. కొన్నేళ్ల నుంచీ ఉదయంపూట ఒక ఇడ్లీ, ఒక గ్లాసు రాగిజావ, ఒక గుడ్డు తీసుకుంటూ వచ్చారు. పదకొండున్నరకు బొప్పాయి పండు తినేవారు. అది రెగ్యులర్‌గా ఉండాల్సిందే. నాన్న రూమ్‌ నుంచి బెల్‌ మోగిందంటే, ఆ టైమ్‌కు ఏం తీసుకెళ్లాలో మా అందరికీ తెలుసు. అంతేకాదు, ఆ బెల్‌తో టైమ్‌ ఎంతైందన్నది కూడా మాకు తెలిసిపోయేది.
యమున: ఇటీవలే మందుల వల్లనో, మరొకందుకో కాస్త నలతగా కనిపిస్తూ వచ్చారు. నిద్ర ఎక్కువైంది. దాంతో అన్నం తినే టైమ్‌తో సహా అన్నీ మారిపోయాయి. ప్రతి రెండు వారాలకోసారి హెల్త్‌ చెకప్‌ చేయిస్తూ వచ్చాం. అన్నీ నార్మల్‌గానే ఉండేవి.
కృష్ణవేణి: ఆ రోజు అలా అవుతుందని మేం ఏ మాత్రం ఊహించలేదు. కాస్త జ్వరం, దగ్గు ఉంటే ఆరు గంటలకోసారి దగ్గు మందు తాగించమన్నారు.
గంగ: ఆ రోజు (ఆదివారం) యమున ఉదయం నుంచి నాన్నను దగ్గరుండి అన్నీ చూసుకుంది. ఆ రోజు ఆయన అన్నం తినలేదు. నాన్నకు మామిడిపండంటే ఇష్టం. గుజ్జుగా చేసిస్తే.. అది తిన్నారు. రాత్రి 12.40కి నేను నాన్నను నిద్రలేపి, దగ్గు మందు తాగించాను. ఆయనకు టాబ్లెట్‌ వేసుకోవడం కంటే సిరప్‌ తాగడం ఇష్టం, తియ్యగా ఉంటుంది కాబట్టి. ఆయనకు ఏదైనా అవసరమైతే ఇవ్వమని చెప్పి, నాన్న ఇద్దరు సహాయకుల్నీ ఆయన రూమ్‌ వద్దనే ఉండమని చెప్పాను. తెల్లవారు జామున నాలుగింటికి మెలకువ వస్తే సహాయకుడు రమేశ్ ను అడిగాను.. ‘నాన్నగారు మధ్యలో ఏమైనా నిద్రలేచారా?’ అని. ‘లేదమ్మా. లేవలేదు’ అని అతను చెప్పాడు. వాళ్లను సెల్‌ఫోన్ లు ఆఫ్‌ చేయమనీ, ఫోన్ మోగితే ఆయనకు డిస్టర్బెన్స్ గా ఉంటుందనీ చెప్పి, అప్పట్నించీ కిందే ఉన్నా. సాధారణంగా ఆరింటిలోగా నాన్న బెల్‌ కొడతారు. ఆ రోజు కొట్టలేదని రమేశ్ వెళ్లి నాన్నను చూశాడు. అతనికి డౌట్‌ వచ్చింది. యమునను పిలిచాడు. నేనేమైందని అడిగితే నాకు చెప్పడం లేదు. యమునకు బీపీ చూడటం అలవాటు కాబట్టి, అందుకోసం ఆమెను పిలుస్తున్నాడేమోనని అనుకున్నా కానీ, నాకేమాత్రం అనుమానం రాలేదు. యమున వచ్చి చూసింది కానీ, తను కూడా ఏమైందో మాకు చెప్పడం లేదు (సరస్వతికి దుఃఖం ఆగలేదు. తను ఏడుస్తుంటే గంగ ఓదార్చారు).
యమున: నాకు అర్థమైంది కానీ ఏం చెయ్యాలో, ఏం మాట్లాడాలో ఆ పరిస్థితిలో తోచలేదు. ఆ తర్వాత కేర్‌ హాస్పిటల్‌కు తీసుకుపోయాం.
గంగ: నాన్నలో ఏమైనా కదలిక వస్తుందేమోనని గుండెల మీదా, చెంపలమీదా ఎట్లా కొట్టానో! లాభం లేకపోయింది. (గొంతు పూడుకుపోతుంటే) మేమెంత స్వార్థపరులం. నాన్న పోయినా మేమింకా ఎలా ఉన్నామో!
 
అమ్మను ఎలా చూసుకొనేవారు?
సరస్వతి: ఆయన దృష్టిలో అమ్మ అంటే ఏమిటనేది ఆయన రాసిన ‘రుతుచక్రం’ చదివితే అర్థమవుతుంది. అమ్మ 1982లో పోతే, ఆమె మీద ప్రేమతో ’84 నుంచీ ఆమె పేరుతో ‘సుశీలా నారాయణరెడ్డి’ అవార్డు ఇస్తూ వచ్చారు. మొదటి అవార్డు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మకు ఇచ్చారు.
గంగ: రెండోదో, మూడోదో రంగనాయకమ్మకు ఇద్దామనుకున్నారు. ఆమె ‘సుశీల అవార్డు’ అని ఉంటే తీసుకునేదాన్ననీ, ‘సుశీలా నారాయణరెడ్డి అవార్డు’ అని ఉంది కాబట్టి తీసుకోననీ అన్నారు. నాకు కూడా భర్త పేరు తగిలించుకోవడం ఇష్టం ఉండదు. అయితే ఇక్కడ ‘సుశీల’ అంటే ఎవరికి తెలుస్తుంది? అమ్మకు సొంతంగా గుర్తింపు లేదు కదా. అందుకే నాన్న పేరు జోడించి ఆ అవార్డు పెట్టాం. అయితే తను తీసుకోనన్నారు. ఏమైనా ఆమె గొప్ప రచయిత్రి.
 
ఆ అవార్డును కొనసాగిస్తారా?
గంగ: చేస్తామండీ. మా తర్వాత మా పిల్లలు కూడా దాన్ని కొనసాగిస్తారు. మాకా నమ్మకం ఉంది. మూడేళ్ల క్రితం నాన్నతో అన్నాను. ‘అమ్మ పేరుతో అవార్డునిస్తున్నాం కదా. అలాగే మీ పేరుతో నేషనల్‌ అవార్డ్‌ పెట్టి, భారతీయ భాషల్లో మంచి ప్రతిభ చూపుతున్న రచయితలకు అది అందిద్దాం’ అని చెప్పాను. కమిటీ సభ్యులుగా కొంతమందిని అనుకున్నాం కూడా! తను ఉండగా ఆ అవార్డ్‌ వద్దనీ, కావాలంటే తను పోయాక ఇచ్చుకోమని ఆయననేసరికి ఆ ఆలోచన మానుకున్నాం. నాన్న జన్మదినానికి అదివ్వాలని అప్పట్లో అనుకున్నాం. వచ్చే నెల్లోనే ఆయన జన్మదినం కాబట్టి, ఈ ఏడాది కుదరదు. వచ్చే ఏడాది నుంచీ ఇవ్వడానికి ప్లాన చేస్తాం. దానికోసం ఓ కమిటీ వేయాలి.
కృష్ణవేణి: ప్రతి ఏటా తన పుట్టినరోజుకు పుస్తకం వేయడం నాన్నకు అలవాటు. ఈ ఏడాదీ ఒక పుస్తకం తీసుకువస్తాం. ఇంకా దానికి పేరు పెట్టలేదు. డీటీపీ వర్క్‌ జరుగుతోంది.
 
నాన్నగారి గురించి ప్రపంచానికి తెలీని విషయాలంటూ ఏమైనా ఉన్నాయా?
సరస్వతి: మాకు తెలిసి ఏమీ లేవు. మా నానమ్మ అంటే నాన్నకు బాగా ఇష్టం. ఆవిడకూ నాన్నంటే అంతే ఇష్టమంట. ఆమె పేరు బుచ్చమ్మ. మా తాతయ్య పేరు మల్లారెడ్డి.
గంగ: నేను పుట్టకముందే.. 1953లోనే నానమ్మ పోయింది. ఆమెకు నాన్న ఒక్కడే కొడుకు. అంత గారాబంగా కొడుకును పెంచడం ఆ చుట్టుపక్కల ఎవరూ చూడలేదంట. అమ్మానాన్నలది బాల్య వివాహం. పెళ్లికి నాన్న వయసు పదకొండేళ్లయితే, అమ్మకు తొమ్మిదేళ్లు.
సరస్వతి: మా నానమ్మ ఊళ్లో అందరినీ సమానంగా చూసేదంట. డబ్బున్నవాళ్లూ, పేదవాళ్లూ, పెద్ద కులం, చిన్న కులం అనే తేడా లేకుండా అందరితోనూ బాగుండేదంట. నిమ్న కులాల వారినీ వరుసలు పెట్టి పిలిచేదంట. ఆమె గురించి ఊళ్లో జనమంతా గొప్పగా చెప్పుకొనేవాళ్లంట. అదే గుణం నాన్నకూ వచ్చింది.
 
ఆడపిల్లలని మిమ్మల్ని సున్నితంగానే పెంచారా?
కృష్ణవేణి: లేదు. మమ్మల్నందర్నీ స్వేచ్ఛగా పెంచారు. మేం ఆడపిల్లలం కాబట్టి.. ఇలాగే పెరగాలి.. అని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన ఎలాంటి ఆంక్షలూ పెట్టలేదు.
సరస్వతి: మేం అన్ని పనులూ చేసుకుంటూ వచ్చాం. నాన్న పాటలు ఎక్కువగా రాసే రోజుల్లో ఆదాయం బాగుండేది.
గంగ: మద్రాస్‌ నుంచి వచ్చి ఇంట్లోకి అడుగుపెట్టగానే, చేతిలోని బ్రీఫ్‌కేస్‌ మా చేతుల్లో పెట్టి ‘హమ్మయ్య’ అని చేతులు దులుపుకొనేవాళ్లు. డబ్బంటే ఆయనకు ఎంత ఎలర్జీయో! జేబులో ఎప్పుడూ డబ్బులుంచుకొనేవాళ్లు కాదు. నాన్న డబ్బు కోసం ఎప్పుడూ పాటలు రాయలేదు. వాళ్లు ఇచ్చింది తీసుకొనేవాళ్లు. సినిమాలు తీసి డబ్బు పోగొట్టుకున్న కొంతమంది నిర్మాతలు ఇచ్చుకోలేకపోతే, నాన్నెప్పుడూ వాళ్లని అడగలేదు.
 
నాన్నగారు రాసిన పాటల్లో మీకు బాగా ఇష్టమైనవి ఏంటి?
సరస్వతి: అలా చెప్పడం కష్టం. ఆయన రాసినవన్నీ మాకు ఇష్టమైన పాటలే.
గంగ: ఆయన రాసిన పాటలన్నింటినీ కలిపి ఒక పుస్తకంగా తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఆయన సమగ్ర సాహిత్యంలోనూ కొన్ని పాటల గురించే రాశారు. వచ్చే ఏడాదే ఆ పుస్తకం తీసుకువస్తాం. నాకు తెలిసి అన్ని రకాల పాటలు, అంత సౌందర్యంగా ఎవరూ రాయలేదు. ఎవరూ రాయలేరు కూడా. అలాగే ‘ఏకవీర’, ‘అక్బర్‌ సలీం అనార్కలి’ చిత్రాలకు ఆయన మాటలు రాశారు. ఆ రెండు సినిమాల స్ర్కిప్టులు ఎక్కడా లేవు. ‘ఏకవీర’ సినిమా చూస్తూ, డైలాగ్స్‌ రాశాను. స్ర్కిప్టు తయారైంది. ఇల్లు మారుతున్నప్పుడు ఈ మధ్యే ‘అక్బర్‌ సలీం అనార్కలి’ రఫ్‌ స్ర్కిప్ట్‌ దొరికింది. నాన్న కవిత్వం మాత్రమే చేత్తో రాసేవారు. వ్యాసాలు కానీ, ఇతర రచనలు కానీ ఎప్పుడూ రాయలేదు. ఆయన డిక్టేట్‌ చేస్తుంటే నేను రాసేదాన్ని.
 
ఆయన ఆస్తులు పంచారా?
గంగ: ఆయనెప్పుడూ ఆస్తులు సంపాదించుకోలేదు. అశోక్‌నగర్‌ ఇల్లు అమ్మేసి ఫిల్మ్‌నగర్‌కు వచ్చాం. కాకపోతే అల్లుళ్లకు ఎవరిల్లు వాళ్లకుంది. అందరికీ ఇళ్లున్నాయి. నాన్న చాలా డబ్బు సంపాదించారు కానీ నిలవలేదు. సొంతూళ్లో ఇల్లు, దాని వెనుక కొంత స్థలం ఉన్నాయి. ఒకప్పుడు ఆ ఊళ్లో 150 ఎకరాల భూములుండేవి. వాటన్నింటినీ దానాలు చేసేశారు.
కృష్ణవేణి: కొంత స్థలాన్ని స్కూలు, వెటర్నరీ హాస్పిటల్‌, దోభీఘాట్‌కు విరాళంగా ఇచ్చారు. కొన్ని భూములు పేదలకు ఇచ్చారు. మేం ప్రతి సంవత్సరం అమ్మ వర్ధంతికి జనవరి 10న ఊరికి వెళ్లి, అందరికీ భోజనాలు పెట్టి వస్తుంటాం.
ఒక రైతు కుటుంబంలో పుట్టి.. కవిగా, గేయ రచయితగా, అధ్యాపకునిగా, వక్తగా మహోన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తికి కూతుళ్లుగా పుట్టినందుకు ఎలా అనిపిస్తుంటుంది?
గంగ: రైతు కుటుంబంలో పుట్టి మహాకవిగా ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం ఎంత గొప్ప విషయం! పైగా నైజాంలో ఆ రోజుల్లో పల్లెల్లో చదువుకోవడమంటే ఆషామాషీ కాదు.
సరస్వతి: ఈ జన్మకు ఈ అదృష్టం చాలు. మళ్లీ జన్మంటూ ఉంటే మళ్లీ ఆయనకు పిల్లలుగానే.. (ఏడుపు ఆపుకోలేకపోయారు) పుట్టాలని.. (మిగతా ముగ్గురికీ కన్నీళ్లు తిరిగాయి.. ‘ఊరుకో.. ఊరుకో..’ అంటూ సరస్వతిని ఓదార్చారు గంగ)
 
- బుద్ధి యజ్ఞమూర్తి