ప్రజాసాహితీ గౌరవ సంపాదకుడు నిర్మలానంద ఆకస్మిక మృతి 

సాహితీవేత్తల నివాళులు.. నేడు అంత్యక్రియలు
 
రాంనగర్‌/హైదరాబాద్‌, ఏలూరు, జూలై 24 (ఆంధ్రజ్యోతి): జనసాహితీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ప్రజాసాహితీ గౌరవ సంపాదకుడు, ప్రముఖ అనువాదకుడు నిర్మలానంద (84) ఇకలేరు. మంగళవారం ఉదయం 11.45 గంటలకు హైదరాబాద్‌ బాగ్‌ అంబర్‌పేటలోని తన నివాసంలో ఆకస్మికంగా మృతి చెందారు. భోజనం చేసిన అనంతరం నీళ్లు తాగుతుండగా స్వరంపడి ఒక్కసారిగా కుప్పకూలారు. నిర్మలానంద.. ఇతర భాషల్లోని సాహిత్యాన్ని తెలుగులోకి, తెలుగు సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువాదించేవారు. ఆయన అసలు పేరు ముప్పున మల్లేశ్వర రావు. 1935 అక్టోబరు 20న ఏపీలోని విశాఖ జిల్లా అనకాపల్లిలో జన్మించారు. ఆయన భార్య రుక్మిణి రెండేళ్ల క్రితం మరణించారు. నిర్మలానందకు కుమారులు శివ, జయసూర్య.. కుమార్తెలు శైలజ, అచ్చలజ ఉన్నారు. నిర్మలానంద రైల్వేలో పనిచేసి రిటైరయ్యారు. 18 ఏళ్లు ప్రజాసాహితీ పత్రికకు వర్కింగ్‌ ఎడిటర్‌గా కొనసాగారు. హిందీ సాహిత్య పరిచయంతో నిర్మలానంద వాత్సాయన్‌గా కలం పేరు పెట్టుకున్నారు. తెలుగుదాసు, విపుల్‌ అనే కలం పేర్లున్నా.. నిర్మలానంద పేరుతోనే లబ్ధప్రతిష్ఠులయ్యారు.
 
జాతీయోద్యమ ప్రభావం ఉన్న తండ్రి సలహాతో నిర్మలానంద.. హైస్కూ ల్‌ చదువు పూర్తయ్యే నాటికే హిందీలో పరీక్ష లు పాసయ్యారు. అనకాపల్లిలోని ప్రసిద్ధ శారదా గ్రంథాలయం అయన్ను సాహిత్య రంగంలోకి అడుగుపెట్టేలా చేసింది. ఒరియా, బెంగాలీ, ఇంగ్లిష్‌ భాషల్లో ప్రవేశం సంపాదించారు. ఎక్కడ సాహితీ సభలు జరిగినా హాజరయ్యేవారు. పోతుకూచి సాంబశివరావు నిర్వహించిన తెలుగు రచయితల మహాసభలకు తప్పనిసరిగా హాజరయ్యేవారు. 1970లో మహాకవి శ్రీశ్రీ షష్ఠిపూర్తి సందర్భంగా ఆయన కవితల పుస్తకాన్ని ‘ఆగ్‌ ఉగల్తాహువా ఆస్మాన్‌కీ ఓర్‌ బడతా హువా’ అనే పేరుతో హిందీలోకి అనువదించారు. శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా ఆయన ‘మహాప్రస్థానం’ పుస్తకాన్ని హిందీలోకి అనువదించారు. ఇది 2011 మేలో ప్రచురితమైంది. నిర్మలానంద మరణవార్త తెలుసుకుని పలువురు ప్రజా సాహితవేత్తలు ఆయన నివాసానికి వచ్చి భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్‌లోని మెయిన్‌ చెరువు శ్మశాన వాటికలో బుధవారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తామని కు టుంబ సభ్యులు తెలిపారు. కాగా నిర్మలానంద మృతి పట్ల విప్లవ రచయితల సంఘం సంతాపం ప్రకటించింది.
 
మహాశ్వేతాదేవితో సాన్నిహిత్యం
నిర్మలానందకు ప్రముఖ బెంగాలీ రచయిత మహాశ్వేతదేవితో మంచి సాన్నిహిత్యం ఉండేది. ఆమెపై 1997 మార్చిలో ప్రత్యేక సంచికను తెచ్చారు. అల్లూరి సీతారామరాజు శతజయంతి సందర్భంగా ప్రతి నెల ఏడాది పాటు ఆయనపై ‘మన్యం వీరుని పోరుదారి’ అనే వ్యాస సంకలనాన్ని ప్రచురించారు. దీన్ని మహాశ్వేతదేవి చేతులమీదు గా ఆవిష్కరింపచేశారు.