రవీంద్రభారతి, మే 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ వచ్చే వరకు కవిత్వమంటే తెలియదని, కేవలం పద్యాలు రాసుకునే వాడినని, కవిత్వం కోసమే నగరానికి వచ్చానని ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత కె.శివారెడ్డి పేర్కొన్నారు. మొదటి నుంచి అధ్యాపక జీవితాన్ని ఇష్టపడతానని, ఇందులో భాగంగానే ఇప్పటికీ అదే వృత్తిలో కొనసాగుతున్నానని తెలిపారు. శనివారం రవీంద్రభారతి ప్రాంగణంలోని ఐసీసీఆర్‌ ఆర్ట్‌ గ్యాలరీలో దళిత విప్లవ కవి శివసాగర్‌ స్మారకార్థం కె.శివారెడ్డి ప్రత్యేక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా శివారెడ్డి తన జీవిత ప్రస్థానాన్ని వివరించారు. మొదట్లో ఈవినింగ్‌ కాలేజీలో పనిచేసినట్టు తెలిపారు. హైదరాబాద్‌ వచ్చిన అనంతరం వచన కవిత్వం, పద్య కవిత్వం అంటే ఏంటో తెలిశాయన్నారు. తెలుగు సాహిత్యానికి దేశమంతటా ప్రాచుర్యం ఉందన్నారు. దీనికి ఉదాహరణగా తాను రాసిన కవితలు దేశమంతా తెలిశాయన్నారు. కొన్ని పద్యాలు కవర్‌ పేజీలపై ప్రచురించారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు ఏనుగు నరసింహారెడ్డి, యాకూబ్‌తో పాటు పలువురు కవులు పాల్గొన్నారు.