రవీంద్రభారతి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): స్వామి వివేకానంద తన ప్రసంగాలతో ప్రజలను చైతన్యపరిచిన స్ఫూర్తిప్రదాత అని తమిళనాడు మాజీ గవర్నర్‌ కె.రోశయ్య అన్నారు. బుధవారం రవీంద్రభారతిలో యువకళావాహిని, ఆదర్శ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మహబూబ్‌ కాలేజీ ప్రథమ ప్రసంగ వార్షికోత్సవం సందర్భంగా వివేకానంద 150వ నాటకాన్ని ప్రదర్శించారు. పీవీ కృష్ణమూర్తి రచించిన ఈ నాటకానికి ఎస్‌ఎం.భాషా దర్శకత్వం వహించారు. వైకేనాగేశ్వరరావు నిర్వహణలో ప్రదర్శించిన ఈ నాటకం ప్రేక్షకులను రంజింపజేసింది. స్వామి వివేకానంద పాత్రలో వైకేనాగేశ్వరరావు అద్భుతంగా నటించి ప్రశంసలందుకున్నారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో నిష్ణాతులైన సుధామ, నాగేశ్వర్‌, ఎస్‌పీభారతి, ఆమని, ఎంఏరహీమ్‌, కె.శంకరయ్య, కుసుమ భోగరాజు, వంగా శ్రీనివా్‌సగౌడ్‌ లకు వివేకానంద ప్రతిభామూర్తి పురస్కారాలను ప్రదానం చేశారు.  ముఖ్య అతిథిగా విచ్చేసిన రోశయ్య పురస్కారగ్రహీతలను సత్కరించారు.  నాటకంలో నటించిన కళాకారులను సన్మానించారు. కార్యక్రమంలో సారిపల్లి కొండలరావు, అశ్విని సుబ్బారావు, విజయ్‌కుమార్‌, కేవీ కృష్ణమారి, హరినారాయణరెడ్డి, మహ్మద్‌ రఫీ తదితరులు పాల్గొన్నారు.