ఆంధ్రజ్యోతి, హైదరాబాద్:రంగస్థలంపై వినూత్న ప్రయోగాలతోపాటు, ప్రేక్షకుడికి కావాల్సినంత వినోదాన్ని పంచాలన్న ఉద్దేశంతో మొదలైంది పాప్‌కార్న్‌ థియేటర్‌ గ్రూప్‌. మూడేళ్ల క్రితం 15మంది పాతికేళ్లలోపు కుర్రాళ్లు కలిసి ప్రారంభించిన ఆ నాటక సంస్థ ప్రత్యేకతలు, లక్ష్యాల గురించి పాప్‌కార్న్‌ థియేటర్‌ కార్యదర్శి ప్రణయ్‌రాజ్‌ మాటల్లో...

రంగస్థలాన్ని యువత అమితంగా ప్రేమిస్తుందనడానికి ‘‘పాప్‌కార్న్‌ థియేటర్‌’’ గ్రూప్‌ నిదర్శనం. ఎందుకంటే అందులో ఉన్న సభ్యులంతా పాతికేళ్ల లోపువారే. అంతేకాదు వారంతా నాటకరంగాన్ని ఎంతలా ప్రేమిస్తున్నారంటే ‘జీవితమంత’ అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. సినిమా రంగంలో రాణించాలన్న కోరిక ఉండచ్చు, కానీ నాటకాన్ని వదలేయాలన్న ఆలోచనమాత్రం పాప్‌కార్న్‌ సభ్యులెవరికీ లేదని మాత్రం గట్టిగా చెప్పగలను. మా అందరి ప్యాషన్‌ థియేటర్‌ కనుకనే, మేమందరం కలిసి ఓ గ్రూపును ప్రారంభించగలిగాం. 2014, న్యూఢిల్లీలో ‘టిఫ్లీ’ చిల్ట్రన్స్‌ థియేటర్‌ గ్రూపు వారంరోజులపాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. నాతోపాటు, రంగస్థల యువ దర్శకుడు, నటుడు తిరువీర్‌ ఆ సమావేశాలకు హాజరయ్యాం. జర్మని, దక్షిణ కొరియా వంటి దేశాలకు చెందిన 20 మంది అంతర్జాతీయ నాటకరంగ ఔత్సాహికులు ఆ సదస్సులో పాల్గొన్నారు. వారందరితో మాట్లాడటం, వారి ప్రదర్శనలు, విదేశాల్లో నాటకరంగానికున్న ఆదరణ వంటి విషయాలన్నీ మాలో స్ఫూర్తి కలిగించాయి. థియేటర్‌ గ్రూప్‌ను ప్రారంభించాలన్న ఆలోచన అప్పుడే అంకురించింది. 
 
‘‘అమ్మ చెప్పిన కథ’’తో మొదలు...
తెలుగు నాటక రంగ నటన, దర్శకత్వం, సాంకేతిక విభాగాల్లో ఎంతో మంది యువత పనిచేస్తున్నారు. నాటకరంగాన్నే వృత్తిగా ఎంచుకుంటున్నారు కూడా. అయితే నాటకాన్ని చూడటానికి మాత్రం యువత ఆసక్తి చూపడంలేదన్నది వాస్తవం. మాతోపాటు నిఖిల్‌ జాకబ్‌, ప్రవీణ్‌ గొలివాడ, రాజు కోట్ల, రాజ్‌కుమార్‌ చెవుల, వికాస్‌ చైతన్య, జయశ్రీ, లక్ష్మణ్‌ మీసాల, పవన్‌, క్రాంతి ఖరీదు వంటి ఔత్సాహికులంతా కలిసి సమావేశమయ్యాం. ఆలోచనలు పంచుకున్నాం. అందరం కలిసి 2014, మార్చి20న అబిడ్స్‌లోని ‘గోల్డెన్‌ త్రెషోల్డ్‌’ వేదికగా ‘‘అమ్మ చెప్పిన కథ’’ నాటకాన్ని ప్రదర్శించాం. అదే వేదికపై మేమంతా కలిసి ‘‘పాప్‌కార్న్‌ యంగ్‌ థియేటర్‌’’ గ్రూపును ప్రారంభిస్తున్నామని ప్రకటించాం. సంస్థ ప్రారంభమైన మూడేళ్లలో ‘‘అమ్మ చెప్పిన కథ’’, ‘‘నా వల్ల కాదు’’, ‘‘దావత’’ మూడు నాటికల్నే ప్రదర్శించాం. తెలుగు నాటకరంగ సంప్రదాయాల హద్దులు దాటి, వినూత్నంగా వాటిని రూపొందించామని గర్వంగా చెప్పగలం. 
 
పేరు తెచ్చిన ‘‘దావత’’..
తెలుగు నాటకం అంటే ఇల్లు, సోఫాలు, కుర్చీలు వంటి రొటీన్‌ సెట్టింగులు, రొటీన్‌ ప్రాపర్టీస్‌, లైట్స్‌ ఆన్‌, ఆఫ్‌ బ్రేక్‌లే అని చాలా మంది అభిప్రాయం. కానీ కేవలం బ్లాక్‌ కర్టెన్‌, ఒక బల్ల, రెండు కుర్చీలు, లైట్స్‌ ఆన్‌, ఆఫ్‌ చేయకుండా నాన్‌స్టాప్‌ 40 నిమిషాలకు పైగా సాగుతుంది ‘‘దావత’’ నాటకం. ప్రవేశ రుసుం రూ50తో మొదట లామకాన్‌లో ఆ నాటకాన్ని ప్రదర్శించాం.
 
హౌస్‌ ఫుల్‌ అయింది. తర్వాత తెలంగాణ యువనాటకోత్సవాల్లో భాగంగా రవీంద్రభారతిలో రెండవ ప్రదర్శన జరిగింది. ప్రదర్శన మొదలైనప్పటి నుంచి ముగింపు వరకూ ఆడిటోరియమంతా నవ్వులతో నిండిపోయింది. రంగస్థల ప్రముఖులు, విమర్శకులు సైతం మా ప్రయత్నాన్ని అభినందించారు. విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ రాసిన ‘‘ఫ్రీ లంచ్‌’’ కథ ఇతివృత్తంగా ‘‘దావత’’ను రూపొందించాం. తిరువీర్‌ నాటకీకరణ రచన, దర్శకత్వం వహించిన ‘‘దావత’’ నగరంలోనే కాదు విజయవాడ, విశాఖ వంటి పలు నగరాల్లోనూ ప్రదర్శనలు జరిగాయి. ఎందరో నాటక ప్రియుల అభిమానాన్ని చూరగొంది ఆ నాటకం. అంతేకాదు యువత, బాలల్ని నాటకానికి తీసుకురావలన్న మా లక్ష్యాన్ని కొంత మేరకు నిజం చేసింది. ‘‘దావత’’ నాటక ప్రదర్శనలో ప్రేక్షకులు ఎక్కువ మంది 35ఏళ్లలోపు వారే కావడం మాకు మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. 
 
సమ్మర్‌ థియేటర్‌ వర్క్‌షాప్‌...
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో గతేడాది మే01 నుంచి20 వరకు చిన్నారులకు ప్రత్యేకంగా సమ్మర్‌ థియేటర్‌ వర్క్‌షాప్‌ నిర్వహించాం. నగరంలోని ఏడు బాలల వసతిగృహాలను ఎంచుకొని, అక్కడున్న చిన్నారులకు ఆటలు, పాటలతో పాటు థియేటర్‌ టెక్నిక్స్‌ వంటివి బోధించాం. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పెపొందించడం, నలుగురిలో నిర్భయంగా మాట్లాడటం, టీం స్పిరిట్‌, లీడర్‌షిప్‌ క్వాలెటీస్‌ వంటివన్నీ థియేటర్‌ టెక్నిక్స్‌లో భాగం. అందుకోసమే పిల్లలకోసం ప్రత్యేకంగా వర్క్‌షాప్‌ నిర్వహించాం. అంతేకాదు వారిచేత ప్రొఫెషనల్‌ నాటక ప్రదర్శన చేయించగలిగాం. ఇంకో విషయమేమంటే, ఆ శిక్షణలో మేం పిల్లల ప్రపంచంలోకి వెళ్లాం కానీ, ఇలా చేయండి! అలా చేయద్దు అంటూ వారిని ఒత్తిడి చేయలేదు. వర్క్‌షాప్‌ మొత్తం ఓ ఆటలా సాగింది. ఈ ఏడాది కూడా సమ్మర్‌ వర్క్‌షాప్‌ నిర్వహించే ప్రయత్నంలో ఉన్నాం. మా టీంలో ఉన్న తిరువీర్‌ ‘‘ఘాజీ’’ సినిమాలో మంచి పాత్ర పోషించి పేరు తెచ్చుకున్నాడు. మా టీంలో చాలా మంది సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న వారున్నారు. అలా అని వారంతా రంగస్థలానికి దూరమవ్వలేదు. తెలుగు నాటకరంగం మంచి మార్పు దిశగా అడుగులు వేస్తుందన్న అభిప్రాయం, ఆశ ని కలిగించే విధంగా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు.