తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే చిత్రాలు 
స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ప్రారంభమైన ఆర్ట్‌ అండ్‌ డ్రాయింగ్‌ ఇన్‌స్టాలేషన్‌ ప్రదర్శన 
హాజరైన ‘మల్లేశం’ సినిమా యూనిట్‌ సభ్యులు 
 

మాదాపూర్‌, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): తెలంగాణ చేనేత కార్మికుడి జీవిత చరిత్రను తొలిసారిగా సినిమాగా తెరకెక్కించిన చిత్రం ‘మల్లేశం.’  చిత్రకళా రంగాన్ని, సినిమాను అనుసంధానిస్తూ ‘ఆర్ట్‌ డ్రాయింగ్‌ ఇన్‌స్టాలేషన్‌’ పేరుతో స్టేట్‌ ఆర్ట్‌గ్యాలరీలో బుధవారం ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను మల్లేశం సినిమా హీరో, హీరోయిన్‌తో పాటు చిత్రం యూనిట్‌ సభ్యులు, చిత్రకారుడు, ప్రొడక్షన్‌ డిజైనర్‌ లక్ష్మణ్‌ యేలె అతిథులుగా హాజరై ప్రారంభించారు. లక్ష్మణ్‌ యేలె వేసిన చిత్రాలు ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. లక్ష్మణ్‌ యేలె తన డాక్టరేట్‌ పట్టాకోసం చేపట్టిన పరిశోధనతో పాటు చేతివృత్తులు, కుల పురాణాలు, సామాజిక చలన చిత్రాలను, జ్ఞాన సిద్ధాంతిని ఆవిష్కరించడానికి ఆయన ఎంతో శ్రమించారు. సినిమా కోసం ఆయన గీసిన అద్భుత చిత్రాలు, కళా నిర్మాణాలు, కళలు, సంస్కృతిలో దేశీయత కోసం అనుక్షణం తపించే తన అక్షరాలకు అద్దం పట్టే రీతిలో చిత్రాలు పునర్జీవం పోసుకున్నాయి. 

తెలంగాణ సంస్కృతి, వేష, భాషలపై ఆయన వేసిన ఆర్ట్‌ అండ్‌ డ్రాయింగ్‌తోపాటు ఇన్‌స్టాలేషన్‌ వంటి చిత్రాలు ప్రపంచ దేశాలను సైతం ఆకట్టుకుంటున్నాయి. తొలిసారిగా నేతన్నకు చేయూత అనే కాన్సె్‌ప్టతో తీసిన ‘మల్లేశం’ చిత్రంలో అద్భుతంగా పొందుపరిచారు. చిత్రాల్లో వాడిన వంకర, టింకర గీతలతో నిర్మొహమాటంగా చేస్తున్న బహిరంగ భావ ప్రకటన ద్వారా లక్ష్మణ్‌ మూలధాతువులు, తెలంగాణ గ్రామీణ ప్రజానీక జీవన విధానం ప్రతిఫలించే భాషను తన కుంచెద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. 

ఆకట్టుకున్న ఫ్యాషన్‌ షో
అనంతరం ఏర్పాటు చేసిన ఫ్యాషన్‌ షోలో పలువురు మోడల్స్‌ చేనేత వస్త్రాలు ధరించి ఆకట్టుకున్నారు. మగ్గంపై తయారు చేసిన దుస్తులు ధరించి క్యాట్‌వాక్‌ చేశారు. 
 
ఆకట్టుకున్న చిత్రప్రదర్శన
లక్ష్మణ్‌ యేలె వేసిన చిత్రాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి.  ప్రదర్శనలో 50 ఆర్ట్‌ అండ్‌ డ్రాయింగ్‌, ఇన్‌స్టాలేషన్‌ వంటి చిత్రాలు ప్రదర్శనకు ఉంచారు.  మగ్గంపై దుస్తులు నేస్తున్నట్టు వేసిన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 
 
తెలంగాణ భాష, యాసను కాపాడుకోవాలి

మల్లేశం సినిమాలో రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామీణ ప్రాంతంలోని చింతకింది మల్లేశం జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తీశాం. ఈ చిత్రంలో చేనేత కార్మికులు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టినట్టుగా చిత్రీకరించాం. ఇలాంటి సినిమా ద్వారా తెలంగాణ భాష, యాసను భవిష్యత్‌ తరాలకు అందించేందుకు దోహదపడుతుంది. మల్లేశం సినిమా తెరకెక్కించడం ఎంతో గర్వంగా ఉంది.    

-  చిత్రకారుడు, ప్రొడక్షన్‌ డిజైనర్‌ లక్ష్మణ్‌ యేలె