గుంటూరు(సాంస్కృతికం): బృందావన్‌ గార్డెన్స్‌ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో ఉషోదయ కళానికేతన్‌ పదో వార్షికోత్సవ వేడుకల సందర్భంగా గురువారం ప్రదర్శించిన ఆఖరి ఉత్తరం నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జరిగిన సభకు గుంటూరు కళాపరిషత్‌ ప్రధాన కార్యాదర్శి బండ్ల పూర్ణ చంద్రరావు అధ్యక్షత వహించారు. సభలో వాస్తు సిద్ధాంతి తల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, కమర్షియల్‌ ట్యాక్స్‌ రిటైర్డు డిప్యూటీ కమిషనర్‌ బి. వేదయ్య, భారతీ సాంస్కృతిక కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల ప్రసాదరావు, రంగస్థల నటులు, రచయిత, దర్శకుడు నుసుము నాగభూషణం, వరికూటి శివప్రసాద్‌, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్‌ మ స్తానయ్య, సంస్థ నిర్వాహకుడు, రచయిత, దర్శకుడు చెరుకూరు సాంబశివరావులు ఆధ్వర్యంలో రంగస్థల కళాకారులు కూనపరెడ్డి మస్తాన్‌రావు, గుడివాడ లహరి, పీ. లీలామోహన్‌, ఆర్‌.కావ్య ప్రియలను ఘనంగా సత్కరించారు. అనంతరం మీరెక్కడున్నా ఎంత సంపాదించినా కనీసం సంవత్సరానికి ఒక్కసారైన వచ్చి తల్లిదండ్రులను చూసి వెళ్ళండని తల్లిదండ్రుల మనోవేదనతో రాసిన ఆఖరి ఉత్తరం నాటిక సందేశాత్మకంగా సాగింది. చెరుకూరి సాంబశివరావు, రామయ్య, ఎస్‌. అమృతవర్షిణి, మస్తాన్‌రావు నటించగా సాంబశివరావు రచన, దర్శక త్వం వహించారు. లీలామోహన్‌ సంగీత సహకారాన్ని అందించారు.