అనువాదాలు పెరగాలి

స్వదేశీ భాషల పునరుద్ధరణ,సాంస్కృతిక పరిరక్షణ నేడు అవసరం

తెలుగుతల్లికి పట్టాభిషేకమిది

తెలంగాణ సారస్వత పరిషత్తు 75ఏళ్ల మహోత్సవంలో ఉప రాష్ట్రపతి రూ. 5 లక్షల విరాళం

‘‘ పరాయి భాషా వ్యామోహం పరస్త్రీ వ్యామోహం కన్నా అన్యాయమైనది. పట్టుకుంటే అంత సులువుగా పోదు...అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు, గెజిట్‌లు మాతృభాషల్లోనే వెలువడాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రభుత్వాలు స్పందించాలంటే భాషోద్యమాలు రావాలి. దేశంలోని అన్ని పోటీ పరీక్షలతో పాటు శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక రంగాల కోర్సులన్నీ స్వదేశీ భాషల్లో బోధన జరగాలి...’’

వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

హైదరాబాద్‌ సిటీ, మే 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఇంటింటా తెలుగు గానాన్ని వినిపించాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ‘‘ఈ రాష్ట్రంలో మాతృ భాషాభివృద్ధికి తీసుకుంటున్న నిర్ణయాలు, అమలుచేస్తున్న విధానాలు చూస్తుంటే ఆనందంగా ఉంది. ప్రాథమిక విద్య నుంచి తెలుగు బోధన తప్పనిసరి చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభినందనీయులు. ఆయన స్వతహాగా భాషా ప్రేమికుడు. అంతర్జాలం హవా సాగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ దేశాలకు తెలుగు గొప్పతనాన్ని తెలియజేసే ప్రయత్నాలు జరగాలి. ఆయన చొరవ తీసుకోవాలి’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. శనివారంనాడు తెలంగాణ సారస్వత పరిషత్తు 75 వసంతాల వేడుకకు ఆయన హాజరై కొన్ని సూచనలు చేశారు. ‘‘ తెెలుగు భాష, సాహిత్యాల మాధుర్యాన్ని నవతరానికి తెలిపేందుకు సారస్వత పరిషత్తు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరముంది. అందుకోసం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని విశ్వవిద్యాలయాలు సారస్వత పరిషత్తుతో అనుబంధంగా ఉండాలి. ఇతర భాషా సాహిత్యం తెలుగులోకి వస్తున్నట్టుగా మన రచనలు అనువాదమవడం లేదు. తెలుగు సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువదించే బాధ్యతను పరిషత్తు చేపట్టాలని కోరుతున్నాను’’ అన్నారాయన.

‘‘కొన్ని రోజుల క్రితం లాటిన్‌ అమెరికాలోని పెరూ, పనామా, గ్వాటెమాలా దేశాలు పర్యటించాను. అక్కడ వారి మాతృ భాషలేవీ సజీవంగా లేవు. పనామలోని 27 స్వదేశీ భాషలను ప్రజలు మర్చిపోయారు. స్పెయిన్‌ వలస పాలనే అందుకు కారణం. పెరూలో మాత్రం అక్కడి భాష, సంస్కృతి మూలాలను అన్వేషించే ప్రయత్నాలు మొదలయ్యాయి. జర్మనీలో సంస్కృతంలో ఉన్న వేదాలు, ఉపనిషత్తులపై అధ్యయనం చేస్తున్నారు. రష్యా, ఫ్రాన్స్‌ వంటి ఇతర దేశాధినేతలంతా ఇతర దేశాల పర్యటనలో ఉన్నప్పుడు మాతృభాషలోనే మాట్లాడతారు.

 ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్వదేశీ భాషల పునరుద్ధరణ, సాంస్కృతిక పరిరక్షణ అవసరం’’ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై చైతన్యాన్ని రగిలించడంతోపాటు తెలుగు భాషా, సంస్కృతి అస్తిత్వాన్ని నిలపడంలో మహత్తర పాత్ర పోషించిన తెలంగాణ సారస్వత పరిషత్తు పంచ సప్తతి మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ వేడుకలే తెలుగు తల్లికి జరుగుతున్న నిజమైన పట్టాభిషేకంగా అభివర్ణించారు. పరిషత్తు నూతన భవన నిర్మాణం కోసం తన జీతం నుంచి రూ 5 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నానని, ఈ సంస్థకు సహాయ, సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రితో మాట్లాడతాననీ వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ కూడా రూ 2లక్షల విరాళాన్ని ప్రకటించారు.