10న  మండోదరి నృత్యరూపకం
పంజాగుట్ట, సెప్టెంబర్‌ 4 (ఆంధ్రజ్యోతి): భారత పౌరాణిక చరిత్రలో అద్భుతమైన పాత్ర మండోదరి అని...ఆమె ఘన చరిత్రను కూచిపూడి నృత్యరూపకం ద్వారా ఈ తరానికి తెలియచేసే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రముఖ నర్తకీమణి, తెలుగు విశ్వ విద్యాలయం రిజిస్ర్టార్‌ ఆచార్య డాక్టర్‌ అలేఖ్య పుంజల తెలిపారు. తృష్ణ కూచిపూడి డ్యాన్స్‌ అకాడమీ, టెంపుల్‌బెల్స్‌ ఈవెంట్స్‌, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ నెల 10న సాయంత్రం 6.30 గంటలకు రవీంద్రభారతిలో తన నృత్య దర్శకత్వంలో మండోదరి కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శించనున్నట్లు ఆమె తెలిపారు. మండోదరి పాత్రను తాను పోషిస్తున్నానన్నారు. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో గణేష్‌, వినోద్‌కుమార్‌ , తన శిష్య బృందంతో కలిసి ఆమె ‘మండోదరి ఏ క్వీన్‌ అండ్‌ హర్‌ డైలమాస్‌’ పేరుతో రూపొందించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం పుంజల మాట్లాడుతూ నాట్యమే తన ఊపిరని,  నాలుగు సంవత్సరాల వయస్సులో నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టి, ఈ వయస్సులో కూడా  నిత్య విద్యార్థిగా నాట్యాన్ని నేర్చుకుంటున్నానన్నారు. తాను చదువుకున్న విశ్వవిద్యాలయంలోనే రిజిస్ర్టార్‌గా పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 1990లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా తెలుగు విశ్వవిద్యాలయంలో చేరానని, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతో మంది నృత్యంలో తన వద్ద శిక్షణ పొందారన్నారు.  నృత్యాన్ని ఉన్నత స్థాయికి చేర్చాలన్నదే తన కోరిక అని, ప్రతిసారీ కొత్త కొత్త సబ్జెక్ట్‌లని తీసుకుని వాటికి రూపం ఇచ్చి ప్రదర్శించడమే తన జీవితాశయమన్నారు.  రెండు సంవత్సరాల క్రితం రాణీ రుద్రమ ప్రదర్శన ఇచ్చానన్నారు. 9 నెలలుగా తాను, తన శిష్య బృందం మండోదరి నృత్యరూపకం  నేర్చుకున్నామన్నారు. చాలా ఉన్నతమైన స్ర్తీ పాత్ర మండోదరిదన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మ్యూజిక్‌ను అందిస్తున్నామని వినోద్‌కుమార్‌ తెలిపారు. మండోదరి, ఇతర  పాత్రధారుల వస్ర్తాల కోసం ఎంతో కష్టపడ్డామని గణేష్‌ తెలిపారు.  ప్రదర్శన ఉచితమని అలేఖ్య పుంజల తెలిపారు. తనతో పాటు 26 మంది కళాకారులు తెరపైన, మరో 25 మంది తెరవెనుక సహాయ సహకారాలు అందిస్తురన్నారు. కూచిపూడి వారసత్వ కళాకారులు చింతా బాలకృష్ణ, తాడేపల్లి సత్యనారాయణ, పసుమర్తి కుమారదత్త, మరో 26 మంది  ఈ రూపకంలో వివిధ పాత్రలను పోషిస్తున్నారన్నారు.
 
అలేఖ్య పుంజలకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లలితకళా పీఠం అధిపతి, వర్సిటీ వీసీ రిజిస్ట్రారుగా పనిచేస్తున్న ఆచార్య అలేఖ్య పుంజలకు విశ్వవిద్యాలయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 30ఏళ్లుగా తెలుగు వర్సిటీలో నృత్యశాఖలో అధ్యాపకురాలిగా పనిచేస్తూ అనేక మంది విద్యార్థులను అంతర్జాతీయ స్థాయి కళాకారులుగా తీర్చిదిద్దారు. అలేఖ్య పుంజల కేంద్ర సంగీత నాటక పురస్కారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ హంస, ఉగాది, సిద్ధేంద్రయోగి నర్తన పురస్కారాలను అందుకున్నారు. ప్రస్తుతం తెలుగు వర్సిటీ ప్రథమ మహిళా రిజిస్ట్రారుగా పనిచేస్తున్నారు.