రాంనగర్‌, అక్టోబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): సాధన నరసింహాచార్య నిరంతరం సాహితీ చైతన్య శీలి అని పలువురు వక్తలు పేర్కొన్నారు. సాధన సాహితీ స్రవంతి పేరుతో 5 దశాబ్దాలుగా అనేక సాహితీ, వైజ్ఞానిక, అవధానాలు నిర్వహించిన ఘనత నరసింహాచార్యకే దక్కుతుందని వారన్నారు. శనివారం కళాసుబ్బారావు కళావేదికలో నరసింహాచార్య సాహిత్య సేవా స్వర్ణోత్సవం, ‘సభా పర్వం’ గ్రంథావిష్కరణ జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన పి.మధుసూదనరావు, ప్రముఖ కవి తిరునగరి గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తన స్వర్ణోత్సవ సాహితీ సేవలో తన వెన్నంటే ప్రోత్సహించిన పలు సాంస్కృతిక సంస్థల ప్రతినిధులను, సాహితీవేత్తలను నరసింహాచార్య సత్కరించారు.  సాధన నరసింహాచార్య దంపతులను సాహితీవేత్తలు సత్కరించారు. వేదికపై ప్రముఖ కవి దివంగత డాక్టర్‌ ఆచార్య తిరుమల స్మారక సాహితీ పురస్కారాన్ని కవయిత్రి లక్కరాజు నిర్మలకు బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ఆచార్య ముదిగొండ శివప్రసాద్‌, సుధామ, జి.సంధ్య తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం కవి సమ్మేళనం జరిగింది.