రవీంద్రభారతిలో పరుచూరి రఘుబాబు స్మారకార్థం

 తొలిరోజు ఐదు నాటికల ప్రదర్శన 
 

బర్కత్‌పుర, మే 1 (ఆంధ్రజ్యోతి): పరుచూరి రఘుబాబు స్మారక 29వ అఖిల భారత నాటక పోటీలు 2019 రవీంద్రభారతిలో బుధవారం ప్రారంభమయ్యాయి. పరుచూరి రఘుబాబు మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలిరోజు నిర్వహించిన నాటకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ నాటక పోటీలను సినీ నటుడు తనిష్‌ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. 

తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పరుచూరి గోపాల కృష్ణ, పరుచూరి వెంకటేశ్వర్‌రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ‘భూమి దు:ఖం’ నాటికతో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. పెద్దింటి అశోక్‌కుమార్‌ రచించిన ‘తెగారం’ నాటకం బారతుల రామకృష్ణ రచించిన ‘తలుపులు తెరిచే ఉన్నాయి’ నాటిక సింహప్రసాద్‌ రచించిన ‘దాడి’ నాటకం శార్యాని గ్రామీణ గిరిజన సాంస్కృతిక సంఘం బోరివంక వారి ‘నిర్జీవ నినాదం’ నాటికలను తొలిరోజు ప్రదర్శించారు. మనకు సంబంధం ఉన్నవాటిని ఎందుకు దూరం చేసుకుంటున్నామో తెలియటంలేదు. ఇది తెలియజెప్పేందుకు చేసే ప్రయత్నమే మా తలుపులు తెరిచే ఉన్నాయి నాటిక ఉద్దేశం. రైతులు పడుతున్న ఇబ్బందులు, వేల ఎకరాలు రియల్‌ ఎస్టేట్‌గా ఎలా మారిపోతున్నాయో భూమిదు:ఖం నాటికలో కళ్లకు కట్ట్దినట్లు చూపించారు. భూమిని చులకన చేసిన వారికి ఎవరికైనా చివరికి మిగిలేది దు:ఖమేనని తెలియజెప్పే సుందరయ్య బూదేవమ్మల జీవితమే భూమి దు:ఖం నాటకం ఉద్దేశం.