కవాడిగూడ(హైదరాబాద్), ఆగస్టు 16: ట్యాంక్‌బండ్‌పై శ్రీశ్రీ విగ్రహం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ సాహితీ, ప్రజానాట్య మండలి నేతలు ఆరోపించారు. ట్యాంక్‌బండ్‌పై కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న శ్రీశ్రీ  విగ్రహానికి తెలంగాణ సాహితి, ప్రజానాట్యమండలి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతినిధులు గురువారం తాళ్లుకట్టి తాత్కాలికంగా నిలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ సాహితీవేత్తలు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ట్యాంక్‌బండ్‌పై శ్రీశ్రీ విగ్రహం   కూలిపోవడానికి సిద్ధంగా ఉందన్నారు. శ్రీశ్రీ సాహిత్యం, కవిత్వాన్ని కాపాడడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.  తక్షణమే పున: నిర్మించలేకపోతే చలో రవీంద్రభారతికి పిలుపునిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితీ ప్రతినిధులు పి.ఎన్‌.మూర్తి, రచయిత నరేష్‌, కృష్ణ, ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి కట్ట నర్సింహ, సైదులు, వీరాంజనేయులు, పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు.