బర్కత్‌పుర, మే 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పరుచూరి రఘుబాబు మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో పరుచూరి రఘుబాబు స్మారక 29వ అఖిల భారత నాటకోత్సవం  ఘనంగా ముగిసింది. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం 4 నుంచి 8.30 వరకు  జరిగిన పోటీల్లో డాక్టర్‌ ఎం.ఎ్‌స.చౌదరి రచన, దర్శకత్వంలో న్యూస్టార్‌ మోడరన్‌ థియేటర్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌, విజయవాడ వారిచే ఇదా నా దేశం నాటిక, రిషి శ్రీనివాస్‌ మూలకథ, యల్లాప్రగడ భాస్కరరావు నాటకీకరణ, వేముల మోహనరావు దర్శకత్వంలో వేముల ఆర్ట్‌ థియేటర్స్‌ గుంటూరు వారిచే మనసులోపలి మనిషి నాటిక, వల్లూరు శివప్రసాద్‌ రచన, పోలవరపు భుజంగరావు దర్శకత్వంలో పండు క్రియేషన్స్‌ కల్చరల్‌ సొసైటీ కొప్పోలు వారిచే రాజీనా? నాటిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. 

అనంతరం జరిగిన బహుమతుల ప్రదానోత్సవ సభలో ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహదారు డాక్టర్‌ కె.వి.రమణాచారి విశిష్ట అతిథులుగా రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పి.రామ్మోహన్‌రావు, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడు బి.శివకుమార్‌, దైవజ్ఞశర్మ, పరుచూరి సోదరులు, తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో నాటకాల్లో మొదటి బహుమతి తెగారం, రెండో బహుమతి ఆదిగురువు అమ్మకు, నాటికల్లో మొదటి బహుమతి అతీతం, రెండో బహుమతి తలుపులు తెరిచే ఉన్నాయ్‌, ప్రత్యేక బహుమతి రాజీనా? నాటికకు వచ్చాయి. ఉత్తమ దర్శకులుగా డాక్టర్‌ మల్లేష్‌ బాలష్టు, డాక్టర్‌ ఎం.ఎ్‌స.చౌదరి, ఎస్‌.రవీంద్రరెడ్డి బహుమతులు  పొందారు.