ఉత్తమ ప్రదర్శనగా ‘కృష్ణబిలం’ 
ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా చాలు.. ‘ఇక చాలు’ 
తృతీయ ఉత్తమ ప్రదర్శనగా ’గోవు మాలచ్చిమి’ 

నరసరావుపేట, గుంటూరు:స్థానిక భువనచంద్ర టౌన్‌హాల్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన రంగస్థలి ఆహ్వాన నాటిక పోటీలలో ఉత్తమ ప్రదర్శనగా కళాంజలి హైదరాబాద్‌ వారి కృష్ణబిలం ఎంపికైంది. ఆదివారం ముగింపు కార్యక్రమంలో విజేతలకు జ్ఞాపికలను, నగదు పారితోషికాలను అందజేశారు. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా శ్రీసాయి ఆర్ట్స్‌ కొలకలూరి వారి చాలు...ఇక చాలు, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా ఉషోదయ కళానికేతన్‌ హైదరాబాద్‌ వారి గోవు మాలచ్చిమిలు ఎంపికయ్యాయి. ఉత్తమ నటుడిగా చాలు...ఇక చాలు నాటికలోని రామారావు పాత్రధారి గోపరాజు రమణ, ఉత్తమ నటిగా గోవు మాలచ్చిమి నాటికలో వెంకటలక్ష్మి పాత్రధారి ఎస్‌.అమృతవర్షిణి ఎంపికయ్యారు. ఉత్తమ క్యారెక్టర్‌ నటుడిగా అరవింద ఆర్ట్స్‌ తాడేపల్లి వారి ఆగ్రహం నాటికలో రామ సుబ్బయ్య పాత్రధారి డీవీ లక్ష్మయ్య ఎంపికయ్యారు.
 
 
ఉత్తమ హాస్యనటుడిగా యంగ్‌ థియేటర్‌ ఆర్గనైజేషన్‌ విజయవాడ వారి ఖేల్‌ ఖతం దుకాణం బంద్‌ నాటికలోని పెద్ద దొర పాత్రధారి డి.వెంకటేశ్వరరావు, ఉత్తమ ప్రతి నాయకుడిగా అరవింద ఆర్ట్స్‌ తాడేపల్లి వారి ఆగ్రహం నాటికలోని చక్రపాణి పాత్రధారి గంగోత్రి సాయి ఎంపికయ్యారు. ఉత్తమ ఆహార్యం అవార్డును ఖేల్‌ ఖతం దుకాణం బంద్‌ నాటికకు పి.మోహనరావుకు అందజేశారు. ఉత్తమ రంగాలంకరణ ఆగ్రహం నాటికకు వినోద్‌కు అందజేశారు. ఉత్తమ సంగీతం అవార్డు గోవు మాలచ్చిమి నాటిక సంగీతకారుడు లీలా మోహన్‌ అందుకున్నారు. ఉత్తమ బాల నటుడిగా మాకంటూ ఒక రోజు నాటికలో కిట్టమూర్తి పాత్రధారి మాస్టర్‌ శరవణశాసి్త్ర ఎంపికయ్యారు. ప్రత్యేక జ్యూరీ బహుమతిని ఇదే నాటికలోని దాలయ్య పాత్రధారి జె.సుబ్రహ్మణ్యం సతీ్‌షకు అందజేశారు. బహుమతుల అనంతరం ప్రదర్శించిన కురుక్షేత్రంలోని రాయబారం సీన్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. గుమ్మడి గోపాలకృష్ణ గాత్ర మాధుర్యానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. కార్యక్రమంలో ఆర్డీవో గంధం రవీంద్ర, రంగ స్థలి గౌరవ అధ్యక్షుడు కేవీకే రామారావు, అధ్యక్షుడు కిలారు వెంకటరావు, ఉపాధ్యక్షులు షేక్‌ బాజీ మస్తాన్‌, కార్యనిర్వాహక కార్యదర్శులు షేక్‌ మహబూబ్‌ సుభానీ, బోసు, కోశాధికారి గిరిధర్‌ కుమార్‌, సభ్యులు కేఆర్‌ ప్రసన్నకుమార్‌, ఎం.ఆరోగ్యంచౌదరి, లింగారావు తదితరులు పాల్గొన్నారు.