రవీంద్రభారతి, సెప్టెంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): తెలుగు ప్రజల గుండెల్లో రావు బాలసరస్వతీదేవి, భానుచందర్‌ చిరస్థాయిగా నిలిచిపోతారని తమిళనాడు మాజీ గవర్నర్‌ కె.రోశయ్య అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో ప్రాజ్ఞిక ఫౌండేషన్‌, ప్రాజ్ఞిక ఆర్ట్స్‌ అకాడమీ, సీల్‌వెల్‌ కార్పొరేషన్‌  సంయుక్త ఆధ్వర్యంలో సంగీత సాహిత్య సమలంకృతే శీర్షికన సినీ గీత రచయిత సముద్రాల, సంగీత దర్శకుడు మాస్టర్‌ వేణులకు స్వరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలి తెలుగు సినీ నేపథ్య గాయని రావు బాలసరస్వతీదేవికి సముద్రాల పురస్కారం, సినీ నటుడు భానుచందర్‌కు మాస్టర్‌ వేణు పురస్కారాలను ప్రదానం చేశారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రోశయ్య పురస్కార గ్రహీతలను ఘనంగా సత్కరించి అభినందించారు. ప్రాజ్ఞిక సంస్థ వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందని అన్నారు. రావుబాలసరస్వతీదేవి గానం  శ్రోతల్ని అలరించిందని పేర్కొన్నారు. భానుచందర్‌ అద్భుతమైన నటనతో ఆనాటి ప్రేక్షకులకు దగ్గరయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీల్‌వెల్‌ సీఎండీ బండారు సుబ్బారావు, డా.కె.సత్యనారాయణగౌడ్‌, వై.కె.నాగేశ్వరరావు, లయన్‌ విజయ్‌కుమార్‌, బి.భీమ్‌రెడ్డి, పద్మ, మోహన్‌  పాల్గొన్నారు. ప్రాజ్ఞిక సంస్థ అధ్యక్షుడు, గాయకుడు ప్రవీన్‌ నేతృత్వంలో రావుబాలసరస్వతీదేవి పాడిన  పాటలను అఖిల, సురేఖామూర్తి,   ప్రత్యేకంగా పాడారు.