గుంటూరు: మాతృభాషా దినోత్సవం సందర్భంగా గుడివాడ తెలుగు భాషా వికాస సమితి ఈ ఏడాది గిడుగు రామమూర్తి పంతులు సాహితీ పురస్కారం 2016ను జిల్లా పరిషత్‌ ఇన్‌చార్జి సీఈవో సోమేపల్లి వెంకట సుబ్బయ్యకు అందజేయనున్నారు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ నెల 29 సోమవారం గుడివాడ వాసవి చౌక్‌లోని కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో సోమేపల్లికి ఈ అవార్డును అందజేసి సత్కరిస్తున్నట్లు ఆ సంస్థకు చెందిన డీఆర్‌బీ ప్రసాద్‌ తెలిపారు. సోమేపల్లి ఇప్పటివరకు లోయలో మనిషి, తొలకరి చినుకులు, చల్లకవ్వం, రెప్పల చప్పుడు, తదేక గీతం, పచ్చని వెన్నెల అనే వచన కవిత్వాలను రచించారు. అవార్డుకు ఎంపిక చేయడంపై పలువురు రచయితలు హర్షం వ్యక్తం చేశారు.