అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో 
త్వరలో తానా తెలుగు భవన్‌
మొదటిసారిగా ఏకగ్రీవంగా ఎన్నికలు
 
పంజాగుట్ట, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి):  అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘంగా, నాలుగు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న సంస్థగా పేరు పొందిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 22వ మహాసభలు జూలై 4 నుంచి 6 వరకు అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో జరగనున్నాయి. మహాసభలను వైభవంగా నిర్వహిస్తామని తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన తెలిపారు. సుమారు రూ.35 కోట్ల వ్యయంతో 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో తానా తెలుగు భవన్‌ను నిర్మిస్తున్నామన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో తానా ఇండియా కో ఆర్డినేటర్‌ ప్రసాద్‌ గారపాటి, సుబ్బారావు చెన్నూరి, ట్రస్టీ రవితో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు.

మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు సినీ, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటారన్నారు. ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి, గాయనీమణులు చిత్ర, సునీతలతో పాటు పలువురితో సంగీత విభావరి ఉంటుందన్నారు. మహాసభలను పురస్కరించుకొని వివిధ నగరాల్లో పలు కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. చిన్నారులు, పెద్దల కోసం ఆటల పోటీలు, తెలుగు భాషపై పట్టుకోసం చిన్నారులకు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. తానా చరిత్రలో మొదటిసారిగా కమిటీ సభ్యులు 45 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. 

మహాసభల్లో అతిథులుగా దేశ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుతో పాటు పలువురు పాల్గొంటారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తదితరులకు ఆహ్వానాలు అందించామన్నారు. ఈ సమావేశంలో తానా ప్రతినిధులు పాల్గొన్నారు.