చిక్కడపల్లి(హైదరాబాద్), ఆగస్టు 18: తెలంగాణ తొలి నాటకకర్త తూము రామదాసు అని వక్తలు పేర్కొన్నారు. త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో శనివారం రాత్రి గానసభలో ప్రముఖ సాహితీవేత్త తూము రామదాసు జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికారభాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకరరావు, గానసభ అధ్యక్షుడు కళాజనార్దనమూర్తి, ప్రముఖ సాహితీవేత్త నాళేశ్వరం శంకరం తదితరులు ప్రసంగించారు. తెలుగుభాషపై నిర్బంధం సాగించిన నిజాం పాలనలో ఆంధ్ర నాటకానికి సమాంతరంగా తూము రామదాసు రచించిన ‘కాళిదాసు’  తొలినాటకంగా నిలుస్తోందన్నారు ఈ సందర్భంగా నాళేశ్వరం శంకరాన్ని సన్మానించారు. కార్యక్రమంలో గాయని శారద తదితరులు పాల్గొన్నారు.