దశలవారీగా అమలు

డిజిటల్‌ మాధ్యమాల్లో విస్తృత వినియోగం 
ఐటీ శాఖ చర్చాగోష్ఠిలో నిర్ణయం 

హైదరాబాద్‌, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రపంచ తెలుగు మహాసభల్లో మాతృభాష అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వపరంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ వెబ్‌సైట్లలో తెలుగు వినియోగాన్ని తప్పనిసరి చేయాలని తీర్మానించారు. దీన్ని దశలవారీగా అమలు చేయనున్నారు. దీంతోపాటు మరో ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐటీ శాఖ డిజిటల్‌ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో నిర్వహించిన చర్చాగోష్ఠిలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయే్‌షరంజన్‌,  డిజిటల్‌ మీడియా విభాగం సంచాలకుడు దిలీప్‌ కొణతం, సహాయ సంచాలకుడు మాధవ్‌, కూచిభొట్ల ఆనంద్‌, ఉమామహేశ్వరరావు, సురేష్‌ కూచిభొట్లతోపాటు డిజిటల్‌ మాధ్యమాల్లో తెలుగు వాడకంపై వివిధ రంగాల్లో కృషి చేస్తున్న 60 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో చేసిన ఆరు సూచనలను ఐటీ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్రభుత్వ పాలనలో తెలుగు వినియోగాన్ని మరింత పెంచుతామని జయేష్ రంజన్‌ హామీ ఇచ్చారు.  
ఆమోదించిన తీర్మానాలివే..

రెండేళ్లకోసారి ప్రపంచ అంతర్జాల సదస్సు నిర్వహించడం. 

డిజిటల్‌ తెలుగు రంగంలో ఉపకరణాలను అభివృద్ధి చేస్తున్న ప్రోగ్రామర్లకు పోటీ పెట్టి ప్రోత్సహించడం, తెలుగు వాడకాన్ని పెంచడం, సరళతరం చేయడం. 

కొత్త తెలుగు ఉపకరణాలు, అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి పాటుపడుతున్న వారికి సహాయం అందించడం. 

ప్రభుత్వ ఉద్యోగులు, రచయితలు, విలేకర్లు, విద్యార్థులకు డిజిటల్‌ మాధ్యమాల్లో తెలుగు వాడకంపై అవగాహన సదస్సులు నిర్వహించడం. 

ప్రభుత్వ వెబ్‌సైట్లలో తెలుగు వాడకాన్ని ప్రోత్సహించడం, దశలవారీగా తప్పనిసరి చేయడం. 

గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ వంటి అంతర్జాతీయ సాంకేతిక సంస్థలు, సామాజిక కార్యకర్తల సహాయంతో డిజిటల్‌ మాధ్యమాల్లో తెలుగును విస్తృతంగా వినియోగంలోకి తేవడం.