తెలుగు నాటకానికి ఆదరణ తక్కువనీ, నాటకం పనైపోయిందనీ ప్రచారం జరుగుతోంది. అయితే అవన్నీ అసత్యాలే అంటున్న గోవాడ క్రియేషన్స్‌ నిర్వాహకులు వెంకట్‌ తన నాటక సంస్థ ప్రయాణాన్ని ఇలా వివరిస్తున్నారు.

హైదరాబాద్: ‘‘పరిషత్‌ పోటీ గిరి దాటకపోవడంతో మన నాటకం ఎదగలేకపోయింది. ఆ పరిధి నుంచి బయటకు తీసుకురావడం కోసమే తెలుగు రాష్ట్రాలలో కొన్ని నాటక సంస్థలు పనిచేస్తున్నాయి. అలా మొదలైందే గోవాడ క్రియేషన్స్‌. రంగ స్థలంతో 20ఏళ్ల అనుబంధం నాది. నాటకం కోసం సినిమా...సీరియల్స్‌...కొన్ని సందర్భాలలో ఉద్యోగాన్నివదులుకున్న పరిస్థితి. డా. విజయభాస్కర్‌(ఏపీ కల్చలర్‌ డైరెక్టర్‌) ప్రోత్సాహంతో స్వరాజ్‌, జార్జి, పి. శ్రీనివాస్‌ పలువురు మిత్రులతో కలిసి 2013లో ‘‘గోవాడ క్రియేషన్స్‌’’ ప్రారంభించాం.

కమర్షియల్‌ నాటకంగా...!

ఓ నాటకాన్ని రూపొందించాలంటే నటీ, నటులు, సంగీతకారుడు, ఆర్ట్‌, ఆండ్‌ క్రాఫ్ట్‌, లైటింగ్‌ ఇవన్నీతోపాటు నెల నుంచి 3నెలల వరకు రిహార్సిల్స్‌, అందుకు అయ్యే ఖర్చు ఇవన్నీ కలిపి కనీసం లక్ష రూపాయలు దాటుతుంది. అదీ ఒక్క ప్రదర్శనకు. ఆ ఆర్థిక సమస్యతోనే మన తెలుగు నాటకం వెనకంజలో ఉంది. అంతేకానీ మానవ వనరుల కొరతతోకాదు. దీన్ని మేం సవాల్‌గా తీసుకున్నాం. ఆధునికంగా మనిషి ఎంత ఎదుగుతున్నా సామాజికంగా పట్టిపీడిస్తున్న కుల వ్యవస్థపై అస్త్రంగా ‘‘రాజిగాడు రాజయ్యాడు’’ నాటికను రూపొందించాం. 65మంది నటీనటులను తీసుకున్నాం. 2నెలలకుపైగా రిహార్సిల్స్‌ చేశాం. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలతోపాటు బెంగుళూరులోనూ 15 ప్రదర్శనలు జరిగాయి. ఒక్కో ప్రదర్శనకు అయిన ఖర్చు రూ..1.5లక్షలు. ముందు పెట్టుబడి పెట్టి ప్రజల్లోకి వెళ్లాం. వద్దు...డబ్బు రాదు అన్నారు. భయపెట్టారు. కానీ ముందడుగే వేశాం. ప్రతి చోటా మాకు విజయమే వరించింది. ఎంతో మంది కళాభిమానులు నాటకం చూసి విరాళాల రూపంతో ఆ మొత్తాన్ని అందించారు. ప్రముఖుల ప్రశంసలు అందాయి.

పారితోషకం విషయంలోనూ..

తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ప్రదాత కొమరీం భీం జీవిత ఇతివృత్తంగా ఓ నాటికను రూపొందించాం. ప్రభుత్వ ఆదరణ లేకపోవడంతో 3 ప్రదర్శనలకే పరిమితమైంది. కానీ 6 నందులను గెలుచుకుంది ఆ నాటిక. ప్రముఖ రచయిత పాటిబండ్ల ఆనందరావు రాసిన ‘‘రాజ గృహ ప్రవేశం’’ నాలుగు చోట్ల ప్రదర్శించాం. అంబేద్కర్‌ జీవితం ఆధారంగా సాగుతుంది ఆ నాటకం. మానవ సంబంధాల నేపథ్యంలో ఓ పేద వాడి ఆత్మాభిమానాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన నాటిక ‘‘రచ్చబండ’’. 20 ప్రదర్శనలకు పైగా నోచుకుంది. ప్రతి చోట ప్రజల మన్ననలు, ప్రశంసలు అందుకుంది. కొత్త దర్శకులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో రాజ్‌కుమార్‌ చెవుల యువకుడు రచన, దర్శకత్వం వహించిన ‘‘ఈ పయనం ఎటు..?’’ నాటికకు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాం. గోవాడ క్రియేషన్స్‌ ద్వారా 100మందికిపైగా నటీ, నటులు పనిచేస్తున్నారు. పనిచేసిన వారందరికీ పారితోషకం అందించడం సంస్థ నియమ నిబంధన. కొన్ని ప్రదర్శనలకు పెట్టిన ఖర్చు రాని సందర్భాలున్నాయి. ఆ విషయంలో ఇప్పటివరకు వెనకడుగు వేయలేదు.