జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి 

ఆబిడ్స్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): భాషాభిమానాన్ని పెంపొందించడంలో తెలుగు వారు వెనుకబడి ఉన్నారని జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి అన్నారు.  తెలంగాణ సారస్వత పరిషత్‌ 76వ స్థాపన దినోత్సవాలు శనివారం రాత్రి బొగ్గులకుంటలోని సారస్వత పరిషత్తు డాక్టర్‌ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి మాట్లాడుతూ ఓయూలో  తెలుగు శాఖ ప్రారంభమైన రోజులలో ఎంఏ తెలుగులో తొలి పట్టభద్రుడైన మహాకవి డాక్టర్‌ పల్లా దుర్గయ్య జయంతిని పురస్కరించుకుని పరిషత్తు సభను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ సారస్వత పరిషత్తు  తెలుగు భాషను నిలబెడుతోందన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షుడు ఆచార్య అనుమాండ్ల భూమయ్య పల్లా దుర్గయ్య ‘గంగిరెద్దు’ కావ్య విశిష్టతను విశ్లేషించారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి డాక్టర్‌ ముదిగంటి సుజాతారెడ్డి, పల్లా దుర్గయ్య కుమారుడు డాక్టర్‌ పల్లా శ్యామ్‌సుందర్‌, పరిషత్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జుర్రు చెన్నయ్య,కోశాధికారి మంత్రి రామారావు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.