పద్య నాటకాల్లో పలు ప్రదర్శనలు..
పదవీ విరమణ చేసినా పద్యనాటకంలో సేవ... 
హరినాథ్‌ ఇంట.. అవార్డుల పంట..
 
మేడిపల్లి, అక్టోబర్‌ 19 (ఆంధ్రజ్యోతి): అతడు తన నటనా కౌశలంతో నవరసాలు పండించగలడు.. తన హావ భావాలతో చూపరులను మెప్పించగలడు.. తన కంఠంతో మృదుమధురమైన పద్యాలు ఆలపించగలడు.. ధీరోదాత్తమైన పాత్రలను ఆవలీలగా పోషించి ప్రేక్షకులను ఒప్పించి మెప్పించగలడు. అటు పౌరాణికం.. ఇటు సాంఘిక పద్య నాటకాలలో వైవిధ్యమైన ఎన్నో పాత్రలు పోషించి ప్రేక్షకుల మన్ననలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నాడు ఏటూరి హరినాథ్‌.

జీవితాన్ని ప్రతిబింబించేదే నాటకం.. నాటకానికి ప్రతిస్పందించేదే జీవితం అంటూ కుటుంబ పోషణకు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. తనకు అత్యంత ఇష్టమైన ప్రవృత్తి నాటక రంగాన్ని నేటికీ కొనసాగిస్తున్నాడు హరినాథ్‌. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపేటలో 1954లో జన్మించిన  ఆయనకు చిన్నతనం నుంచి నాటక రంగంపై మక్కువ ఎక్కువ. పౌరాణిక, సాంఘిక పద్య నాటకాలలో తనదైన శైలిలో అనేక రకాల పాత్రలు వేసి రాణిస్తూ ఔరా అనిపిస్తున్నాడు.  

కొన్నేళ్ళ క్రితం వృత్తి పరమైన ఉద్యోగ విరమణ చేసినా అతని ప్రవృత్తి అయిన రంగస్థలానికి మాత్రం ఇంకా విశ్రాంతి ఇవ్వలేదు. ఇప్పటి వరకు దాదాపు 600లకుపైగా నాటక ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులకు కనువిందు చేసి వారి మన్ననలు అందుకున్నాడు. ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగిన ఏటూరి హరినాథ్‌ అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాడు. సింగరేణి కాలరీస్‌ కొత్తగూడెం(సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం) ఏరియాలో ఉద్యోగం చేస్తూ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌గా 2013లో ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం రాజధానికి మకాం మార్చి నగర శివారులో మేడిపల్లిలోని పంచవటి కాలనీలో స్థిరపడ్డాడు. ఉద్యోగ బాధ్యతలు నెరవేరుస్తూనే నాటక రంగం వైపు దృష్టి సారించి 1987 నుంచి ప్రదర్శనలు ఇవ్వడం మెదలుపెట్టాడు. ఉద్యోగ విరమణ పొందినా ప్రస్తుతం నగరంలోని పలు కళా క్షేత్రాలలో నాటకాలలో పాల్గొంటూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అక్షర దీపం ప్రాజెక్ట్‌లో సింగరేణి తరపున రెండు నెలలపాటు ఆయన భాగస్వామ్యం వహించారు. అంతేకాక ఆలిండియా రేడియో కొత్తగూడెం స్టేషన్‌లో ఆడిషన్డ్‌ ఆర్ట్టిస్టుగా సుమారు 150పైగా ప్రోగాంలు చేశారు.
అవార్డులు..
ఖమ్మంలో నిర్వహించిన నంది నాటకాలలో వశిష్ఠ విశ్వామిత్ర నాటకానికి జ్యూరీ అవార్డు లభించింది.
గుంటూరులో నిర్వహించిన నంది నాటకోత్సవంలో చాణక్య చంద్రగుప్తలో ధనంజయుడు పాత్రకు ఉత్తమ తృతీయ బహుమతి కైవసం చేసుకున్నారు. 
తిరుపతి మహతి కళా క్షేతరంలో టీటీడీ ఆధ్వర్యంలో వివిధ నాటక పరిషత్తులచే నిర్వహించిన విశ్వామిత్ర విజయం, సర్వజ్ఞ శ్రీ కృష్ణ, చాణక్య చంద్రగుప్త, మాయాబజార్‌ వంటి నాటకాలకు అనేక బహుమతులు అందుకున్నారు. 
వీటితోపాటు పలు ప్రదర్శనలకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక బహుమతులు, ప్రశంసాపత్రాలు పొందారు.  
 
పద్య నాటకాలను ప్రోత్సహించాలి..
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాల మాదిరిరిగా ప్రతిఏటా రాష్ట్ర ప్రభుత్వం పద్య నాటకాలను కూడా నిర్వహిస్తూ తెలంగాణ పద్య నాటక కళాకారులను ప్రోత్సహించాలి. రంగస్థల నాటికలకు ఆదరణ అంతరించిపోకుండా తగిన ప్రోత్సాహం అందించాలి. ఎంతో మంది కళాకారులకు తగిన గుర్తింపు లేక నటన వదులుకుంటున్నారు. రంగస్థలాన్ని ప్రోత్సహిస్తూ కళాకారులకు తగినఆదరణ కల్పిస్తే మన కళలు పదికాలాల పాటు మనగలుగుతాయి. 
 - ఏటూరి హరినాథ్‌
 
పోషించిన ముఖ్య పాత్రలలో కొన్ని ..
సత్యహరిశ్చంద్ర హరిశ్చంద్రుడు
రామాంజనేయ యుద్ధం   శ్రీ రాముడు
శ్రీ కృష్ణ రాయబారం శ్రీ కృష్ణుడు
సీతారామ కల్యాణం శ్రీ రాముడు
మోహినీ భస్మాసుర విష్ణుమూర్తి
భద్రాచల క్షేత్ర మహత్యం విష్ణుమూర్తి
వశిష్ఠ విశ్వామిత్ర విశ్వామిత్రుడు
సర్వజ్ఞ శ్రీ కృష్ణ ధర్మరాజు
బ్రహ్మంగారి నాటకం సిద్దుడు
అభిజ్ఞాన శకుంతలం దుష్యంతుడు
చింతామణి            భవానీ శంకరుడు,  బిళ్వ మంగళుడు
చాణక్య చంద్రగుప్త చంద్రగుప్తుడు