చిక్కడపల్లి, డిసెంబర్‌ 15(ఆంధ్రజ్యోతి): వాసిరెడ్డి సీతాదేవి వంశీ గ్రంథాలయం వారు వాసిరెడ్డి సీతాదేవి 85వ జయంతి సందర్భంగా త్రిభాషా రచయిత్రి స్వాతిశ్రీపాదకు వాసిరెడ్డి సీతాదేవి వంశీ సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. శనివారం వాసిరెడ్డి సీతాదేవి వంశీ గ్రంథాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సినీగేయరచయిత  సుద్దాల అశోక్‌తేజ ఈ సందర్భంగా స్వాతిశ్రీపాదను సత్కరించారు. పురస్కార గ్రహీత స్వాతి శ్రీపాద గురించి మాట్లాడుతూ స్వాతి పూలదండలో దాగిన దారం అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో స్వాతి శ్రీపాదతోపాటు శైలజమిత్ర, కె శ్రీనివాసమూర్తి, జి. లక్ష్మీనారాయణ, దైవజ్ఞశర్మ, ఉదయపద్మ అబుదాబి పాల్గొన్నారు. వంశీ రామరాజు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రచయిత్రి ఉదయపద్మ 50 వేల రూపాయలను వేగేశ్న దివ్యాంగుల ఆశ్రమానికి విరాళంగా ఇచ్చారు. డా. తెన్నేటి సుధాదేవి, శైలజ సుంకరపల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు దివ్యాంగులైన చిన్నారులు నృత్యగీతాలతో అద్భుత ప్రదర్శన ఇచ్చారు.