రవీంద్రభారతి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): వృద్ధాప్యంలోని సాధక బాధకాలను కవి ఎన్‌.గోపి హృద్యంగా కవిత్వీకరించారని ప్రముఖ సీనియర్‌ పాత్రికేయులు రామచంద్రమూర్తి అన్నారు. సోమవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌ ఆధ్వర్యంలో ప్రముఖ కవి ఎన్‌.గోపి రచించిన వృద్ధోపనిషత్‌ పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రామచంద్రమూర్తి పుస్తకాన్ని ఆవిష్కరించి కవిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషికి వృద్ధాప్యం అనివార్యమని, వృద్ధాప్యాన్ని గురించి తనదైన శైలిలో గోపి చక్కగా వివరించారని అన్నారు. యువత పుస్తక పఠనంపై శ్రద్ధ వహించాలని అన్నారు. ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, హర్షవర్ధన్‌, డా.సి.భవానీదేవి, పత్తిపాక మోహన్‌, ఎస్‌.రఘు, సి.ఎ్‌స.రాంబాబు, మద్దాళి రఘురామ్‌ తదితరులు పాల్గొని ఎన్‌.గోపిని సత్కరించి అభినందించారు.