హైదరాబాద్: తెలంగాణ సారస్వత పరిషత్‌లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ముంబాయికి చెందిన కవి, రచయిత యెల్ది సుదర్శన్‌కు ఆచార్య రావికంటి వసునందన్‌ సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పరిషత్‌ అధ్యక్షుడు డాక్టర్‌ సి.నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని పరిషత్‌ తరఫున సుదర్శన్‌కు పురస్కారాన్ని అందజేశారు. రూ.3116 నగదు, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సినారె మాట్లాడుతూ యెల్ది సుదర్శన్‌ స్వస్థలం నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ అని, వారి కుటుంబం ఎప్పుడో ముంబాయికి వెళ్లి అక్కడ స్థిరపడిందని తెలిపారు.

అక్కడ వృత్తిరీత్యా వ్యాపారం చేస్తూనే తెలుగు భాష, సాహిత్యం పట్ల అభిరుచి పెంచుకొని రచనలు చేస్తున్నారని తెలిపారు. పురస్కారాన్ని నెలకొల్పిన ప్రముఖ కవి ఆచార్య రావికంటి వసునందన్‌ యెల్ది సుదర్శన్‌ను పరిచయం చేశారు. పరిషత్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జె.చెన్నయ్య స్వాగతోపన్యాసం చేస్తూ తెలంగాణ ప్రాంతానికి అక్షర భిక్ష పెట్టిందన్నారు. యెల్ది సుదర్శన్‌ స్పందన తెలియజేస్తూ తనకు అంతగా అర్హతలేకపోయినా పురస్కారాన్ని అందిం చిన పరిషత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.