కెవ్వున కేక వేయబోయి చటుక్కున కళ్ళు తెరిచాను. కేక వేశానేమో నాకే తెలియలేదు, కలలోంచి మేలుకున్నానని.అబ్బ! చాలా భయంకరమైన కల.అదేమిటో కొంచెం కూడా గుర్తుకి రావడం లేదుగానీ, నేను ఉన్న రైలు పెట్టెమీద,ఆకాశంలోంచి బండ రాళ్ళు దడదడా,దబదబా వర్షంలా పడిపోతుండగామెలకువ వచ్చింది.దబదబా, దడదడా శబ్దం మళ్ళీ వినిపించింది. ఉలిక్కిపడ్డాను. ‘‘కిరీటి గారూ!’’ ఎవరో గట్టిగా గొంతు చించుకుని అరుస్తున్నారు. పూర్తిగా మెలకువ వచ్చి మత్తు వదిలింది. ఎవరో పిలుస్తున్నారు. వీధి తలుపు బాదుతున్నారు. ఆ శబ్దం, నా కలలోని చివరి దృశ్యంలోని శబ్దం ఒకటే!గబగబా మంచం దిగాను. కాళ్ళు వణుకుతున్నాయి. గుండె దడ ఇంకా తగ్గలేదు. మళ్ళీ తలుపు చప్పుడవడం, ఎవరో నన్ను పిలవడం వినిపించాయి.‘‘వస్తున్నా! వస్తున్నాను!’’ గట్టిగా అరిచాను. కంఠం వణికింది. గొంతు తడారి పోయిందేమో! శబ్దం గొట్టంలోంచి గాలి ఊదినట్లు వచ్చింది. అంత భయపడి పోయానా! అనుకున్నాను.లుంగీ సర్దుకుంటూ, గబగబా వీధి తలుపుకేసి బయలుదేరాను. ‘‘కిరిటీ గారూ! తలుపు తెరవండి సార్!’’ - ఏడుపు వినిపించింది ఆ కంఠంలో. ఆ పిలుస్తున్నది కార్తికేయమూర్తి - తమ్ముడు ఆదిత్యమూర్తిది కదూ! కాకపోవడమేమిటి? తలుపు తెరవగానే అతనే! పద్దెనిమిదేళ్ళ కుర్రాడు. అసలే ఎర్రగా ఉంటాడేమో, ఇప్పుడు అతనిమొహం మరీ ఎర్రగా కంది పోయి వుంది. కళ్ళు ఎర్రగా ఉబ్బి వున్నాయి. ఒకటే కన్నీళ్ళు!‘‘ఆదీ! నువ్వా! ఈవేళప్పుడు...’’ అన్నాను. తెలతెలవారుతోంది. నన్ను చూసీ చూడగానే ‘‘సార్! అన్నయ్యా!... అన్నయ్య! ...’’ అంటూ బావురు మన్నాడు.నాకు గుండె జారిపోయంది. కాళ్ళ వణుకు నిగ్రహించుకోలేక, గుమ్మానికి జేరబడి కూర్చుండిపోయాను.
‘‘ఏం జరిగింది?’’ అన్నాను నీరసంగా.‘‘మీరు త్వరగారండి సార్! వదిన గగ్గోలు పెడుతోంది. నాకు చాలా భయంగా ఉంది. మీక్కూడా ఒక ఉత్తరం ఉంది..’’ ఆదిత్యమూర్తి వెక్కిళ్ళు మధ్య చెప్పిన ఈ మాటల్లో ఒక్కముక్క కూడా అర్థం కాలేదు నాకు.నన్ను నేను సర్దుకునేసరికి ఐదు నిముషాలు పట్టింది. ‘‘వస్తున్నాను. బట్టలు వేసుకుని వచ్చేయడమే. అసలేం జరిగిందో నువ్వు సరిగ్గా చెప్పు. కార్తికి ఏమైంది?’’‘‘ఏమో! అదే తెలియడం లేదు. ఇంట్లో లేడు.’’ఒక్క పిసరు ఆందోళన తగ్గింది నాకు. జరగకూడనిదేమీ జరగలేదు - అన్న సంగతి కాస్త స్థిమిత పరచింది. మళ్ళీ ప్రశ్నించే సరికి.క్లుప్తంగా జరిగినదంతా చెప్పాడు ఆదిత్యమూర్తి. అది వినేసరికి మళ్ళీ గుండెలు కొట్టుకోవడం మొదలు పెట్టాయి. కీడు ఏదీ స్పష్టంగా కనిపించక పోయినా, మనస్సు కీడునే శంకిస్తోంది.శ్రీమతిని లేపాను. ఇంతలో పాలు కూడా వచ్చాయి. అర్జంటుగా కాఫీ పెట్టమని చెప్పి, హాల్లో కొచ్చి ‘‘ఆ నువ్వు బెంబేలు పడడం మానేసి, అలా కాసేపు సోఫాలో కూర్చో! కీడు శంకించకు. ఏవీ జరిగి ఉండదు. అంతా సవ్యంగానే జరుగుతుంది. నేను ఐదు నిమిషాల్లో మొహం కడుక్కుని వస్తాను’’ అని ఆదిత్యమూర్తికి చెప్పి వంటింట్లోకి వెళ్ళాను.