వేంకటేశ్వరస్వామి ఆలయం మెట్లదారి యాచకులతో కోలాహలంగా ఉంది. వారంలో ఏదో రెండు రోజులు, పండగలు, పర్వదినాలప్పుడు తప్ప భక్తుల రద్దీ ఉండటంలేదు. దాంతో యాచకులమధ్య పోటీ వచ్చింది.. వాళ్ళంతా ఏకమై గోమాతను వెంటేసుకొచ్చిన ఓ కొత్త యాచకురాలిపై సామూహిక దాడికి దిగారు. ఆమెను తరిమికొట్టే పనిలో పడ్డారు యాచకులంతా. సరిగ్గా అప్పుడు ఏం జరిగిందంటే...

శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం లోపల భక్తుల కోలాహలం. ఆలయం వెలుపల యాచకుల కోలాహలం. లోపలి కోలాహలంలో భక్తి మిన్నంటే ఆరాధన. బైట భుక్తి కోసం భూమి దద్దరిల్లే ఆరాటం.ఆలయం నుండి బైటకొచ్చిన ముసలిజంట బైట జరుగుతున్న గొడవను ఒక్కక్షణం పరికించారు. ‘‘నువ్వు ఇక్కడకు రాకూడదు. ఊరంతా తిరిగి అడుక్కున్నది చాలక గుడి ముందూ చేరి మా పొట్ట కొడతావా? నిన్నూ....నీ ఆవుని పొడిసిపారేస్తా!’’ ఉక్రోషంతో ఊగిపోతున్నాడు నడివయసు యాచకుడు. వాడి వాదనతో అక్కడున్న యాచకులందరూ ‘‘ఇక్కడకు రావద్దు’’ అంటూ తలోవిధంగా తిడుతున్నారు.‘‘ఒరే! ఇదేం బజారనుకున్నారా...మీ ఇష్టం వచ్చినట్టు గొడవపడుతున్నారు. గుడిముందు ఏమిట్రా మీ దౌర్జన్యాలు. అందరూ జానెడు పొట్టకోసమేగా. దాని కడుపూ నిండాలిగా!’’ అన్నాడు పెద్దాయన.

‘‘అందరూ అడుక్కునే వెధవలేగదా కలిసి ఉండలేరూ?’’ ఈసడించుకుంది పెద్దామె.‘‘ఏం చెప్పమంటావు తల్లీ. మనిషిగా వచ్చి అడుక్కుంటే అంతగా పట్టించుకోం. అదో.... ఆ ఆవుని తోలుకొస్తుంది. దాని ముఖానికి అంత పసుపు, కుంకుమా పెట్టి దాన్ని పక్కన పెట్టుకుని ‘అమ్మా! గోమాతకింత దానం చెయ్యి తల్లీ!’ అనగానే గుడికి వచ్చిన ఆమ్మోర్లంతా ఆవునుదురు, మూపురం, తోక తాకి దండం పెట్టుకుని దానికో పండో కాయో రూపాయో ఇస్తున్నారు. ఇహ మేం ఏం గావాల’’ అంది గద్గదస్వరంతో ఓ బిచ్చగత్తె.

‘‘మా గోడు ఎవరు వింటారు బాబూ. తమరే ఓ దారి చూపించండి’’‘‘ఔను బాబూ!’’ అందరూ అర్థించారు.‘‘వేళా పాళా లేకుండా, సమయం సందర్భం చూడకుండా రచ్చచేస్తే నష్టం మీకే. అంతా సామరస్యంగా మాట్లాడుకోవాలి. ఆలోచించండి. ఇది ఇట్లా తేలేది కాదు. రేపు ఇక్కడే అదో, ఆ రాగిచెట్టు యాపచెట్టు అరుగుమీద కూర్చుని తేలుద్దాం. పొద్దుట కలుద్దాం...సరేనా!’’