అందరిలాంటోడు కాదతను. చెయ్యెత్తు మనిషి, కండలు తిరిగిన భుజాలు, పిత్తపరిగెలా హుషారుగా ఉంటాడు. గలగలమని నవ్వుతుంటాడు. చేపలవేటకెళితే ఒట్టి చేతులతోరాడు. గంపలు నిండుతాయి. గోదారికి ఎదురీదుతాడు. పిలిస్తే పరుగెత్తుకెళ్ళే మనిషి. అందరితలలో నాలుకలా బతుకుతాడు. అవన్నీ గుర్తొచ్చిన గంగ, గోదారిమెట్లమీద కూర్చుని తెగ మురిసిపోయింది. అతడికోసమే ఎదురుచూస్తోంది. అతడెప్పుడొస్తాడో? 

చిక్కని గోధుమరంగుతో గోదావరి మంచి పోటుమీద ఉంది. కలకనీరుతో కలకలలాడుతున్నది. ద్రవంగా కరిగించిన బంగారం ప్రవహిస్తున్నట్లుంది. గోదావరికేసి భయం భయంగా చూస్తోంది గంగ. కన్నుల్ని అటూఇటూ తిప్పుతూ ఆందోళనగా చూస్తోంది. కళ్ళల్లోంచి నీళ్ళు ఉబుకుతున్నాయి. చీర కొంగుతో తుడుచుకుంటున్నది.గోదావరి సందడిగా ఉంది. పడవల ఇంజనుమోతలు నీటిసవ్వడిలో కలిసిపోయాయి. పడవలు, వేటనావలు, ఇసుకబోట్లు.... కలియ తిరుగుతున్నాయి.గంగ కాళ్ళు దగ్గరకు ముడుచుకుని మోకాలుపై గెడ్డం ఆన్చి కూర్చుని దృష్టిమరల్చకుండా తదేకంగా చూస్తోంది. ఒకరోజు కాదు రెండురోజులు కాదు మూడు మాసాలుగా అదే తంతు. క్రమం తప్పని ఎదురుచూపులు... ఎందుకోసం? ఎవరికోసం?గంగ పక్కనే చిన్నగంప. పైనగుడ్డలతో మూత. ప్రతిరోజు మోసుకొస్తుంది. గంపలో ఏముందో తెలీదు.

మనసులో సుడులు తిరుగుతున్న ఆలోచనలు. పరిసరాలు పట్టించుకోదు. కాసేపు ధ్యానం చేస్తున్నట్టుగా కళ్ళు మూసుకుంటుంది. జ్ఞాపకాల వరద. ప్రతిరోజు కనీసం రెండుగంటలు అలాగే గడుపుతుంది. ఇంటికెళ్ళే ముందు గోదారికి దండాలుపెట్టి కళ్ళు తుడుచుకుని నిశ్శబ్దంగా వెనుదిరుగుతుంది.ఒకే సమయం. ఒకే చోటు. దినచర్య మారదు.రావుడు వచ్చాడు. గంగని రోజూ గమనిస్తున్నాడు. ‘వింత మనిషి’ అనుకున్నాడు. ఏ విషయంలోనూ మనకెందుకులే అని ఊరుకోడు. గడగడా వాగడం అలవాటు. మోకాలుఎత్తి లుంగీ కట్టుకుంటాడు. గంగ దగ్గరకు వచ్చాడు. ఆమె పక్కన నిలబడ్డాడు.

పరీక్షగా చూశాడు. ‘‘ఏమిటమ్మా, పొద్దు పొడిచినట్టు రోజూ ఇదే టైముకి ఒంటరిగా వస్తావ్‌. గట్టుమీద అలాగే కూర్చుంటావు. మాటిమాటికీ కళ్ళు ఒత్తుకుంటూ ఏడుస్తావు. చేతులెత్తి గోదారి తల్లికి నమస్కారాలు పెడతావు. నీది ఈ ఊరే అయ్యుండాలి. నీ ఎదురుచూపులు దేనికో చెప్పమ్మా చెల్లమ్మా?’’ వరుస కలిపి అడిగాడు.గంగ మరింత ముడుచుకుపోయింది. చీరకొంగు ముఖానికి అడ్డు పెట్టుకుంది. సన్నగా గొణుక్కుంది. మాట స్పష్టతలేదు. రావుడు రెట్టించలేదు.