‘‘రజనీ! నువ్వు తొందరగా రెడీ కావాలి! నా ఫ్రెండ్స్‌ పిల్లల్లో కొందరికి ‘యంగ్‌ ఎంట్రప్రెన్యూర్‌ అవార్డ్స్‌’ వస్తున్నాయి. మనంవెళ్ళి వాళ్ళని గ్రీట్‌చేసి వద్దాం!’’ ఫ్యాక్టరీ నుండి వస్తూనే శ్రీవారు శేఖర్‌ హడావిడి చేశారు.‘‘అబ్బబ్బ! మీరెప్పుడూ ఇంతే! అరగంటలో తయారవ్వమంటారు. అదెలా వీలవుతుంది?’’ అంటూ విసుక్కుంటూ లేచాను.

‘‘ఇదిగో రజనీ! ఆ అవార్డ్స్‌ ఫంక్షన్‌ స్పాన్సర్‌ చేస్తున్న వాళ్ళు. ఆ ప్రోగ్రాంని అనుకున్న టైమ్‌కి ఠంచన్‌గా మొదలెట్టి ఠంచన్‌గా ముగిస్తారు. నువ్వు తీరిగ్గా తయారయ్యావంటే మనం అక్కడికి వెళ్ళేసరికి ఆ ప్రోగ్రాం అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ చెప్పాడు శేఖర్.‘‘మీరలా ఏడిపిస్తే నేను అస్సలు రానుపోండి! నాకు రావాలనే ఆసక్తికూడా లేదు. మీరే వెళ్ళండి!’’ అంటూ సోఫాలో చేరగిలపడ్డాను.‘‘సరే, నీ ఇష్టం! కానీ నువ్విప్పుడు రాకపోతే తర్వాత నువ్వే బాధపడతావ్‌!’’‘‘నేను బాధపడతానని మీరేం బాధపడక్కర్లేదులెండి మీరు వెళ్ళొచ్చు!’’ అన్నాను.‘‘అంతేనంటావా? అయితేసరే! కానీ ఆ ప్రోగ్రాంకి ముఖ్యఅతిథి ఎవరో తెలుసా? నీకిష్టమైన సినీ హీరోయిన్‌ విజయసుధ. ఇప్పుడుచెప్పు. వస్తావా, నన్నొక్కడినే వెళ్ళమంటావా?’’ అడిగాడు శేఖర్‌.

‘‘నిజంగా విజయసుధ వస్తున్నారా? ఆమాట ముందేచెబితే ఐదు నిముషాల్లో రెడీ అయ్యేదాన్నికదా! ఇక ఇప్పుడు నిమిషంలో తయారవుతాను చూడండి!’’ అంటూ ఉత్సాహంగా లేచి, వాడ్రోబ్‌ వైపు పరుగెత్తాను.వాడ్రోబ్‌ తెరచిచూస్తే, అన్నీ ఇదివరకు కట్టుకున్న చీరలే కనిపిస్తున్నాయి. ఎన్ని చీరలు చూసినా ఏదీ కట్టుకోవాలనిపించడం లేదు. ఒక్కటైనా కొత్తది కనిపించడం లేదు. ‘సినీతారల తళుకుబెళుకు చీరలముందు ఈ చీరలేంబావుంటాయి? అసలే టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీస్‌ అధినేత భార్యని, ఇంత సాదాసీదా చీరలు కట్టుకుంటే నలుగురూ ఏమనుకుంటారు!?