‘‘అమ్మా.. ఈ సంక్రాంతికి రాలేం. నాకు ఒంట్లో బాగోలేదు. బిజినెస్‌ షెడ్యూల్‌లో ఆయన బిజీగా ఉన్నారు. ఒక్క పండగ రోజు మాత్రమే ఇంట్లో ఉంటారట’’ పెద్ద కూతురు ఆమని ఎస్సెమ్మెస్‌ ఇచ్చింది.చిన్న కూతురు తరంగిణి అది కూడా ఇవ్వలేదు. కాల్‌ చేస్తే ‘‘నెక్ట్స్‌ ఫెస్టివల్‌కి వస్తాం లే మమ్మీ’’ అని ఫోన్‌ పెట్టేసింది.అనసూయ మనసు చివుక్కుమంది. ‘‘ఎందుకు వీళ్ళు ఇలా ముఖం చాటేస్తున్నారో’’ కానీ సద్గుణరావు మాత్రం ఒక రోజు ముందుగానే వచ్చేశాడు. అదే ఆమెకు కాస్త సంతోషమనిపించింది. అతడి భార్య సరస్వతి. అత్త అనసూయ నోట్లోంచి వచ్చే ఆదేశాలకోసం ఎదురుచూస్తూ పనులు చక్కబెడుతుంది. ‘‘సరసూ, పిండివంటలు రుచిగా ఉండాలి’’ హుకుం జారీ చేశాడు సద్గుణ్‌.సరస్వతి కష్టపడి ఐదారు వంటకాలు తయారుచేసింది. 

‘‘చిన్నక్కకి జంతికలు ఇష్టం, పెద్దక్కకు ‘నువ్వుల అరిసెలు ఇష్టం’’ అంటూ చేయించాడు. బాగా దోరగా వేయించిన జీడిపప్పుతో లడ్డూలు, బాదుషా, జిలేబి కూడా చేయించాడు.‘‘అక్కావాళ్ళూ రాలేదని బెంగ పడకమ్మా.. నేనే స్వయంగా తీసుకెళ్ళి పిండివంటలు వాళ్ళకి ఇస్తాను’’ చెప్పాడు సద్గుణ్‌. జీవం లేని నవ్వు నవ్వింది అనసూయ.

‘‘నీదంతా పిచ్చిరా, అవన్నీ వాళ్ళు తింటారా?’’ పెదవి విరిచింది. కిందటిసారి పండక్కి కూడా రాలేదు. అప్పుడు కూడా సద్గుణ్‌ ఇలాగే హడావిడి చేశాడు.‘‘ఇవన్నీ పనిగట్టుకుని ఎందుకు మామ్‌. రెండు వేల రూపాయలకు పుల్లారెడ్డి స్వీట్స్‌లో ఆర్డర్‌ ఇస్తే డోర్‌ డెలివరీ చేస్తారు. అదేపనిగా అతను వాటిని మోసుకురావడం.. ఆ స్టాక్‌ మిగిలిపోతే పిల్లలు బైటపడేయడం అలవాటైపోయింది’’ విసుక్కుంది ఆమని.‘‘అతగాణ్ణి అంతదూరం పంపడం ఎందుకు? కొరియర్‌ చెయొచ్చుగా’’ అంది తరంగిణి.