ఆ బంగళా ఔట్‌హౌస్‌ రేకులషెడ్డులో అనాథలా పడిఉందామె. వేళకు కాస్తంత తిండి తెచ్చి ఇస్తుంది పనిమనిషి. ఆమెతప్ప మరెవరూ ఆ షెడ్డులోకి తొంగిచూడరు. ఎన్నడూలేనిది బంగళా చాలా సందడిగా ఉంది. షామియానాలు కడుతున్నారు. లైటింగ్‌ అమర్చుతున్నారు. ఆ హడావుడేమిటో తెలియలేదు ఆమెకు. ఇంతకీ ఆ బంగళాకు ఆమెకూ ఏమిటి కనెక్షను? ఆ హడావుడి అంతా ఆమెకోసమా? లేక ఆమెలాంటి వాళ్ళకోసమా?

మే నెలమండువేసవికాలం. చింతనిప్పులు చెరిగిపోస్తున్నట్టుంది. ప్రాణికోటి విలవిల్లాడిపోతోంది.సీతమ్మకు గబుక్కున మెలకువ వచ్చింది. ఒళ్ళంతా చెమట్లు దిగజారుతున్నాయి. ఒంటిమీద ఉన్న పాత రవిక చెమటకు తడిసి ముద్దైపోతోంది. అసలే అది రేకులషెడ్డు ఔట్‌హౌస్‌. ఈ ఎండలకు గాడిపొయ్యిలా సెగలు పొగలు విరజిమ్ముతోంది. ఆ వేడికి సీతమ్మ ముసలిప్రాణం ఉక్కిరిబిక్కిరైపోతోంది.

పైన ఇనుప కమ్మీలకు అమర్చిన పాత డొక్కు సీలింగ్‌ ఫ్యాన్‌ ఉండడానికైతే ఉందిగానీ అదెప్పుడు తిరుగుతుందో, ఎప్పుడు ఆగిపోతుందో దానికే తెలియదు. తిరిగినా పిండిమరలాగా డబడబా శబ్దంతప్ప గాలిరాదు, పాడూరాదు. దానికి తగ్గట్టు వచ్చేపోయే కరంటొకటి. కరెంటు పోయినా మెయిన్‌ బంగళాకు ఇన్వర్టర్‌ కనెక్షన్‌ ఉంది. ఏసీలూ, ఫ్యాన్లూ తిరుగుతూనే ఉంటాయి. లైట్లు వెలుగుతూనే ఉంటాయి. సీతమ్మ ఉండే ఈ ఔట్‌హౌస్‌కి మాత్రం ఇన్వర్టర్‌ కనెక్షన్‌ లేదు. ఆమాటకొస్తే, ఈ సీతమ్మకూ, ఆ మెయిన్‌ బంగళాకూ ఏ కనెక్షనూ లేదు. అలాగని బొత్తిగా ఏ కనెక్షనూ లేకుండానూ పోలేదు.ఉండటానికైతే పెద్ద కనెక్షనే ఉంది.

‘పేగు’ కనెక్షను. తల్లిపేగు తెంచుకుని పుట్టిన కన్నకొడుకు కనెక్షను! అది ఉంది కాబట్టే, రాజమహల్లాంటి ఆ బంగళాకు దిష్టిబొమ్మలా ఉన్న ఈ పాతరేకుల షెడ్డులో అయినా సీతమ్మ ఉండగలుగుతోంది. సీతమ్మకూ, ఆ బంగళాకూ కాస్తో కూస్తో కనెక్షన్‌ ఉందంటే అది ఆ బంగళాలో పనిచేసే పనిమనిషి శాయమ్మ ద్వారానే! రెండుపొద్దులా బంగళాలోంచి భోజనం, కాఫీ టిఫిన్లు తెచ్చిపెడుతుంది. ఆ రేకులషెడ్డును కాస్తా చిమ్మిపెడుతుంది. కూజాలో మంచినీళ్ళు తెచ్చిపెడుతుంది. తనకున్న రెండు పాత చీరెలూ, తువ్వాలుగుడ్డనూ సీతమ్మే ఉతుక్కుంటుంది. పాపం, పెద్దామె అనే జాలితో శాయమ్మ గుర్తుపెట్టుకుని ఏదో ఇంత తెస్తే తెచ్చినట్టు, లేకపోతే లేదు. ముసల్ది తిందా లేదా అని, ఆ బంగళాలో మనుషులెవ్వరికీ పట్టదు. వాళ్ళ దృష్టిలో సీతమ్మ ఇంకా విరగడకాని పీడ. ఆ బంగళాకు పట్టిన చీడ.