పదేళ్ళుగా నూనె వ్యాపారం చేస్తున్నాడతను. నాణ్యమైన సరుకే. మొదట అంతంతమాత్రంగానే ఉన్నా ఆ తర్వాత క్రమంగా వ్యాపారం పుంజుకుంది. రెండిళ్ళు కొన్నాడు. డబ్బు నిలవ చేశాడు. ఒక్కగానొక్క కొడుకు. పెద్ద స్కూల్లో చదువుతున్నాడు. జీవితం సంతృప్తిగా సాగిపోతోంది అతడికి. కానీ చుట్టూ సమాజంలో ఎన్నో సమస్యలు, కొత్త నీతులు చెలామణీ అవుతున్నాయి. ఆ గాలి అతడికీ సోకింది. అప్పుడు ఏం జరిగింది?

పదేళ్ళుగా వ్యాపారం బావుంది. ఇనప వ్యాపారం, నూనె వ్యాపారం అందరికీ కలిసిరావని కొంతమంది భయపెట్టారు. అయినా సుదర్శనం ధైర్యంగా ముందడుగు వేశాడు. చిన్నగా ప్రారంభించిన నూనె వ్యాపారం, ఆరు నెలలు ఓ మాదిరిగా నడిచింది. ఆ తర్వాత దినదినాభివృద్ధి అన్నట్టు పెరుగుతూ వచ్చింది. ఉన్న ఇల్లు కాక, ఈ పదేళ్ళ లాభాలతో మరో రెండిళ్ళు కొన్నాడు. కొంత డబ్బు వడ్డీలకి తిరుగుతోంది. ఆదాయానికేం లోటు లేదు. ఒక్కడే కొడుకు. వచ్చే సంవత్సరం పదో తరగతికి వస్తాడు. మంచి స్కూల్లో చదువుతున్నాడు.సంసారం, వ్యాపారం, కొడుకు చదువూ అన్నీ బావున్నాయి. చుట్టూ ఎవర్ని చూసినా ఏదో సమస్య. ఆర్థిక సమస్యో లేకపోతే ఆరోగ్య సమస్యో. వీటికితోడు ఒకరితో మరొకరికి పొసగని రకరకాల గొడవలు. రక్తసంబంధీకులు, పరాయి వాళ్ళకన్నా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు.

తల్లిదండ్రులకి పిల్లలకి పడటం లేదు. భార్యాభర్తలకి ఒకరిమీద మరొకరికి నమ్మకం లేదు. త్యాగం, ఆదర్శం, మరొకరికి సేవ చెయ్యటం లాంటివి చాదస్తంగా మారిపోయాయి. సజావుగా, సవ్యంగా బతికేవాళ్ళు, మంచికోసం నిలబడేవాళ్ళు అరుదుగా కనిపిస్తున్న గడ్డుకాలం. కొత్త ధర్మాలు, కొత్త నీతులు పుట్టుకొచ్చాయి. ముందు నువ్వు సుఖంగా ఉండు. నువ్వు సుఖంగా ఉండాలంటే డబ్బు సంపాదించు. నీ తెలివితేటలు, నీ అస్తిత్వం డబ్బు సంపాదించటానికే. ఆ సంపాదించటానికి ఓ హద్దు లేదు. అదో తీరని దాహం. ఎంత సంపాదించినా, డబ్బు సరిపోని చిత్రమైన ఆర్థిక మాయాజాలం. అన్నీ చేరి ఎవరికీ తృప్తిలేని జీవితం. నిరంతర ఆరాటం. ఇలాంటి జీవితం ఎదురుగావున్నా, సుదర్శనానికి ఇంతటి విశ్లేషణా శక్తి లేదు. కానీ స్థూలంగా అతనిలో ఓ గట్టి అభిప్రాయం. చాలా మందిలా తనకి ఇబ్బందులు లేవు. తన జీవితం బావుండటం గొప్ప అదృష్టం, భగవంతుడి దయ.