రామచంద్రాపురం శ్మశానవాటిక దగ్గర మహాప్రస్థానం వ్యాన్‌ ఆగింది. లోపలనుంచి కృష్ణ, నికొలస్‌, మరో ముగ్గురు దగ్గర బంధువులు దిగారు. ‘నారాయణ .. నారాయణ .. నారాయణ ..’ అంటూ శవాన్ని కిందకు దించుతూనే భుజాల మీద కెత్తుకున్నారు. ఏడుపు, బాధ కలగలిసి కృష్ణ గొంతులో నుంచి నారాయణ అన్న మాట నీరసంగా వినిపిస్తోంది. నికొలస్‌ పెదాలు కదులుతున్నాయి కానీ, అది నారాయణ అన్న పదం కాదనిపిస్తోంది. తండ్రితో గడిపిన చివరి క్షణాల మీదకు కృష్ణ మనస్సు అప్రయత్నంగా వెళ్లిపోతోంది.

తండ్రి క్షమించాడా? లేదా? వద్దన్నా వదలని ప్రశ్నలు కృష్ణ లోపల.కళ్లజోడు మొత్తం తెల్ల మబ్బుగా మారిపోయింది. ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లు. ఒంటి మీద తడి బట్టలు, తడి కళ్లు. దేన్ని దేనితో తుడుచుకోవాలో కూడా తెలియటం లేదు కృష్ణకు.బ్రహ్మగారి మాటలకు అనుగుణంగా కృష్ణ చేతులు పనిచేస్తున్నాయి. అయిదారునెలల క్రితం తల్లిని పోగొట్టుకున్న పెదనాన్న కొడుకు వాసు; కర్మకాండలో సహాయం చేయటంతో పాటు కృష్ణ దుఃఖాన్ని పంచుకుంటున్నాడు. కృష్ణ పక్కనే అతని సహచరుడు నికొలస్‌ కూడా ఉన్నాడు కానీ, అతనికి ఈ తతంగమంతా కొత్తగా ఉండటంతో కొంచెం దూరంగా జరిగాడు. శ్మశానానికొచ్చిన బంధువులు, ఇలాంటి పని మీదనే అక్కడకొచ్చిన అపరిచితుల్లో కొందరూ నికొలస్‌ వంక కొంచెం వింతగా చూస్తున్నారు.

కృష్ణ తరఫు బంధువుల్లో కొందరికి నికొలస్‌ అక్కడకు రావటం, కృష్ణతో పాటు కర్మకాండలో పాల్గొనాలని చూడటం అభ్యంతరకరంగా అనిపించింది. ఆ గుసగుసలు, వింతచూపులు తన గురించే అన్నది అర్థమయ్యే .. నికొలస్‌ కొంచెం దూరంగా నిలబడ్డాడు. కృష్ణ మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా నికొలస్‌ని దగ్గరకు రమ్మని పిలుస్తూనే ఉన్నాడు.‘నాన్నగారి మీద ఇది పెట్టండం’టూ చేతికి పిడకలు అందిస్తూ, ఏ పిడక ఏ భాగం మీద పెట్టాలో, ఎందుకు పెట్టాలో వివరణ ఇస్తున్నాడు, ఆ కార్యక్రమం వరకూ బ్రహ్మగారని పిలిపించుకునే ఆ బ్రాహ్మణుడు. తండ్రి మీద ఒక్కో పిడక పెడుతున్నప్పుడల్లా ఒక్కో జ్ఞాపకం తంతోంది.