ఆరు పెళ్ళి చూపులయ్యాయి. అయినా శరత్‌కి పెళ్ళి కుదరలేదు!అతడు చూసిన అమ్మాయిలందరూ అందగత్తెలే. ఆస్తిపరులే. పెద్ద జీతాలతో మంచి ఉద్యోగాలే చేస్తున్నారు. అటువైపు, ఇటువైపు అందరూ ఆమోదించినా ఆఖరు క్షణంలో నాకీ పెళ్ళి ఇష్టం లేదు అనేస్తున్నాడు శరత్‌. కారణం చెప్పడు. పెళ్ళిచూపుల్లో అమ్మాయి, అబ్బాయి ఏకాంతంగా మాట్లాడుకునే సందర్భంలో ఏదో జరుగుతోంది. అదేమిటో శరత్‌ తల్లిదండ్రులకు తెలియడంలేదు. ఇంతలో ఏడో పెళ్ళి చూపులకు ముహూర్తం ముంచుకొచ్చింది. ఇదే ఆఖరు. ఇంక పెళ్ళి చూపులకు మేం రాం. తాడోపేడో తేల్చుకో అని ముందుగానే హెచ్చరించారు తల్లిదండ్రులు.ప్రియను చూసి ఇంటికొచ్చాక పిల్ల నచ్చిందా అని అడిగితే శరత్‌ మాట్లాడలేదు. ఒక్కసారిగా మహోగ్రుడైపోయాడు తండ్రి రంగనాథ్‌. ‘‘పోరా! పోయి చావు! నీ ఇష్టం వచ్చినట్టు అఘోరించు’’ అని రంకెలు వేశాడు

.‘‘నాన్నా! పిల్ల నచ్చింది’’ గబుక్కున చెప్పేసి ‘‘కానీ....కానీ...’’ అని నసిగాడు శరత.‘ఏమిటా కానీ?’’ గద్దించాడు రంగనాథ్‌.ఎప్పుడో ఒకప్పుడు చెప్పాల్సిందే. అందుకే అప్పటికప్పుడే చెప్పడానికి ధైర్యం కూడదీసుకున్నాడు శరత్‌. ‘‘చెప్పరా, చెప్పు!’’ ఈసారి అమ్మ అందుకుంది.సీలింగ్‌ ఫ్యాన్‌మీద దృష్టి నిలిపి తనలో తను గొణుక్కున్నట్టు ‘‘భార్యాభర్తల్లో ఒకరే ఉద్యోగం చేయాలన్నది నా ఉద్దేశం నాన్నా’’ అన్నాడు శరత్‌.

పక్కనే బాంబు పడ్డట్టు అదిరిపోయారు అమ్మానాన్నా!‘వీడికిదేం పోయేకాలం! ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే బోలెడు జీతం. లోన్‌ తీసుకుని డూప్లెక్స్‌ హౌస్‌ కట్టుకోవచ్చు. కార్లో తిరగొచ్చు. పిల్లల్ని ఘనమైన స్కూళ్ళలో చదివించవచ్చు. ఎంత హోదా! ఎంత గౌరవం!ఇవన్నీ ఈ బడుద్ధాయికి తెలియదా?’ తండ్రి ఆలోచన అర్థమైంది కాబోలు ‘‘అది కాదు నాన్నా! ఇద్దరూ ఉద్యోగాలకు పోతే అలనా పాలనా లేక పిల్లలు చెడిపోతారు. యువకుల్లో నేరప్రవృత్తి పెరగడానికీ, అమ్మాయిలు మోసపోతూ ఉండడానికీ ఒక కారణం వారికి తల్లిదండ్రులు ప్రేమ, పెంపకం సరిగా అందకపోవడమే అని శాస్త్రజ్ఞులు అంటున్నారు’’