పాతికేళ్ళక్రితం మా హెడ్డాఫీసులో పని చేస్తుండేవాడిని.ఆ ఆఫీసులో హోదారీత్యా చాలామంది ఉన్నతమైన అధికారులమధ్య నా కేడర్‌ చాలా చిన్నదే అయినా, ఆ ప్రాంగణానికి మెయింట్‌నెన్స్‌ ఆఫీసరుగా నేను విధులు నిర్వహించడంవల్ల కిందనుంచి.. పైస్థాయి దాకా అందరికీ నేను తెలిసినవాడినే. 

ఆ పోస్టుకున్న సాధకబాధకాలు, నా పరిధులు అర్థం చేసుకునేవాళ్ళు కొంతమంది ఉండగా, ‘తుడిచేవాళ్ళు సరిగ్గా తుడవటం లేదు, బాత్రూమ్‌లు శుభ్రంగా ఉండటంలేదు, కుళాయిలు పనిచేయటం లేదు, నీళ్ళు లీకై వేస్టవుతున్నాయి, ప్రాంగణమంతా పిచ్చిగడ్డీ, తుప్పలు, చిత్తుకాగితాలతో నిండిపోతోంది’ లాంటి ఫిర్యాదు మాటలు మాట్లాడే వారూ, రిజిస్టర్‌ లో ఫిర్యాదులు రాయడమే ఎక్కువ వ్యాపకంగా పెట్టుకున్న వాళ్ళందరూ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నా క్యాబిన్‌కి వచ్చేవాళ్ళు. వాళ్ళతో ఒక్కొక్కసారి గంటల తరబడి మాట్లాడాల్సి వచ్చేది.నా కింద పనిచేసే అరవై మంది క్లాస్‌ఫోర్‌ ఉద్యోగులచేత సక్రమంగా పని చెయ్యించడం నా అసలు పని. అప్పటిదాకా జిల్లాల్లో, చిన్నచిన్న ఊళ్ళల్లో ఆఫీస్‌ హెడ్‌గా పనిచేసి వచ్చిన నాకు మొదట్లో ఈ జాబు తలనొప్పిగా అనిపించేది.

మళ్ళీ ఛాలెంజింగ్‌గానూ ఉందనిపించేది. నా స్వభావం ప్రకారం, ‘ఏయ్‌ వాచ్‌మన్‌’, ‘ఏయ్‌ స్వీపర్‌’, ‘ఏయ్‌ వాటర్‌ బోయ్‌’ అని ఎప్పుడూ ఎవర్నీ పిలవను. వాళ్ళని పేర్లుపెట్టి పిలవడమే నా నైజం. నా కిష్టం. అలాగే చేసేవాడిని. అది వాళ్లకి నచ్చింది. నామీద నమ్మకం, గౌరవం ఏర్పడ్డాయి. అందువల్ల స్నేహంతో, ప్రేమతో వాళ్ళచేత కాస్త పనిచేయించేగలిగేవాడిని. మా ఆఫీసుకి జనరల్‌ మేనేజర్‌ పొజిషన్లో ఉన్న ముగ్గురు అత్యున్నతాధికారులూ ఇతర రాష్ట్రాలవాళ్ళే. పొద్దున్నే వాళ్ళు ఆఫీసుకు వచ్చి పోర్టికోలో కార్లు దిగగానే వాళ్ళని రిసీవ్‌ చేసుకోడానికి వాళ్ళవాళ్ళ లైజన్‌ ఆఫీసర్లూ, సెక్యూరిటీ ఆఫీసరూ పోర్టికోలో రెడీగా ఉండే వాళ్ళు. సెక్యూరిటీ గార్డ్స్‌ సెల్యూట్‌ తర్వాత వాళ్ళకోసం ప్రత్యేకంగా కేటాయించిన లిఫ్ట్‌లో ఏదో అంతస్తులో ఉన్న తమ తమ ఆఫీసు రూమ్‌లకి వెళ్ళిపోయేవారు. పొరపాటున కూడా మిగతా సిబ్బంది ఎవరితోనూ మాట్లాడేవాళ్ళు కాదు. పోర్టికోలో వాళ్ళ కార్లు ఆగగానే, సిబ్బంది కూడా తలొంచుకుని దూరం దూరంగా జరిగిపోయేవారు.