Telugu Jokes in Andhrajyothi

సవాలుకు సై...

‘నేను హెలికాప్టరుతో భయంకరమైన విన్యాసాలు చేస్తాను. అయినా కూడా కిమ్మనకుండా నా వెనకే కూర్చున్నవారికి లక్ష రూపాయలు’ అని ప్రకటించాడు ఒక పైలెట్‌. ఆ సవాలుకు సిద్ధపడిందో కుర్ర జంట. హెలికాప్టర్‌ ఎగిరింది. గిరగిరా గాల్లో గింగిరాలు తిరిగింది. అయినా వెనక సీట్లోంచి సౌండ్‌ లేదు. చివరికి 
పైలెట్‌కి విసుగుపుట్టి వాహనాన్ని నేల మీదికి దింపాడు. వెనక్కి తిరిగి చూస్తే భర్త ఒక్కడే ఉన్నాడు. ‘అయ్యయ్యో... మీ ఆవిడేది!’ అని కంగారుగా అడిగాడు పైలెట్‌. ‘ఇందాకే పడిపోయింది. అరిస్తే... పందెం ఓడిపోతామని... అలాగే కూర్చుండిపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

 

అందుకే మరి

పోలీస్‌: అర్ధరాత్రివేళ కార్లో స్పీడుగా ఎక్కడికి వెళ్తున్నారు?
అరవింద్‌: మద్యపానం, దాని దుష్ఫలితాల మీద ఉపన్యాసం వినేందుకు వెళ్తున్నా సార్‌.
పోలీస్‌: నేనేమైనా పిచ్చోడిలాగా కనిపిస్తున్నానా... ఇంతరాత్రి పూట అలాంటి ఉపన్యాసం ఇచ్చేదెవరు?
అరవింద్‌: మా ఆవిడ....

 

బంపర్‌ ఆఫర్‌

‘ఏసీ కోచ్‌లో ప్రయాణించేవారి భార్యకు టికెట్‌ ఉచితం’ అని ప్రకటించింది రైల్వేశాఖ. ఆ స్కీమ్‌తో ఏమేరకు ఫలితాలు వచ్చాయో తెలుసుకునేందుకు, పథకాన్ని ఉపయోగించుకున్నవారి ఇళ్లకు సిబ్బందిని పంపింది. తలుపు తట్టిన ప్రతి ఇంట్లోనూ గొడవే! ‘నాకు తెలియకుండా... ఎప్పుడు, ఎక్కడికి, ఎవరితో వెళ్లావు?’ అని.
 

 

అనుభవం

ఆఫీసర్‌: మా కంపెనీ కోసం బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తి కావాలి. మీకా లక్షణాలు ఉన్నాయా?
అభ్యర్థి: నాకంటే బాధ్యతాయుతమైన వ్యక్తి మీకు దొరకడు సార్‌. నేను పనిచేసిన ప్రతి కంపెనీలోనూ, ఏం జరిగినా నాదే బాధ్యత అని తేల్చేవాళ్లు!
 

 

పోయింది

వెంకట్‌: ఉబ్బసం తగ్గడానికి స్వచ్ఛమైన గాలి కోసం కిటికీలు తీసి పడుకోమని చెప్పారు కదా!
డాక్టర్‌: అవును... ఇంతకీ మీ ఉబ్బసం పోయిందా?
వెంకట్‌: లేదు. నా లాప్‌టాప్‌, రోలెక్స్‌ వాచీ మాత్రం పోయాయి.
 

 

డబుల్‌ ట్రబుల్‌

‘ఏమోయ్‌... ఇది విన్నావా? మగవాళ్ల కంటే ఆడవాళ్లు రెట్టింపు మాట్లాడతారట!’
‘అందులో విశేషం ఏముంది? మీకు ఏ విషయాన్నయినా రెండుసార్లు చెప్పాల్సి వస్తుంది కదా!’

అజమాయిషీ

కన్నబాబుకి విమానాశ్రయంలో బిల్‌గేట్స్‌ కనిపించాడు. వెంటనే అతని దగ్గరకు వెళ్లి... ‘‘సార్‌! నాకోసం ఓ క్లయింట్‌ వస్తున్నాడు. ఆ సమయంలో మీరు నా దగ్గరకు వచ్చి ‘బాగున్నావా కన్నా!’ అని అడిగితే నా పరపతి పెరిగిపోతుంది’’ అని ప్రాధేయపడ్డాడు. అతను కోరినట్లుగానే క్లయింట్‌తో మాట్లాడుతుండగా బిల్‌గేట్స్‌ వచ్చి ‘బాగున్నావా కన్నా!’ అని అడిగాడు. వెంటనే కన్నబాబు ‘బుద్ధి లేదూ. క్లయింట్‌తో మాట్లాడుతుంటే విసిగిస్తావా. ఫో అవతలికి’ అనేశాడు!!!
 

 

అంతా టైమ్‌

సుబ్బారావు కారు తోలీ తోలీ అలసిపోయాడు. కాసేపు రోడ్డు పక్కనే నిలిపి ఓ కునుకు తీసే ప్రయత్నంలో పడ్డాడు. అలా తలవాల్చాడో లేదో. ‘హలో. టైమ్‌ ఎంతయ్యింది?’ అని లేపాడు దారిన పోయే దానయ్య. లేచి విసుక్కుంటూ ‘నాలుగున్నర’ అని చెప్పి మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు. మరో పది నిమిషాలకు... ‘మాస్టారూ! టైమ్‌ ఎంతయ్యింది?’ అని అడిగాడు రోడ్డున పోయే రామయ్య. ‘నాలుగూ ముప్పావు’ అని విసుక్కున్నాడు సుబ్బారావు. ఇలాగే ఉంటే లాభం లేదనుకుని ఓ కాగితం మీద ‘నాకు టైమ్‌ తెలియదు’ అని రాసి అద్దానికి తగిలించి నిద్రపోయాడు. పది నిమిషాలు గడిచాయో లేదో ఎవరో నిద్ర లేపారు. ‘టైమ్‌ తెలియదన్నావుగా. నాకు తెలుసు. ఐదు గంటలు’ అని చెప్పి చక్కా పోయాడు, పక్క నుంచి పోయే పాపయ్య.
 

 

Page: 1 of 117
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.