నిజం!భయమేస్తూంది!ఈసారి నిజంగానే భయమేస్తోంది!నిండిపోయిన గుండెని తెరిచి పరిచే ప్రయత్నం చేసిన ప్రతిసారీ భయమేస్తూనే ఉంది.ఎలా?ఎలా దిగమింగుకోవాలి?మది గది సమస్తం ఆక్రమించిన దాన్ని ఆవిష్కరించినపుడు... పొరపాటున, ఏమరు పాటుగా... పరిపాటున పరిష్కారం దొరికి నప్పుడు పర్యవసానాన్ని ఎదుర్కోవడం ఎలా?ప్రతినిత్యం నిను మరుగున పడనీయక, కుదురుగ ఉండక, నిదురకు దూరంగా, ఆలోచనలకి మెరుగులు దిద్దుతూ, నీ వెనక పరుగులు పెడుతూ, వెన్నెల తరగలని దోసిట పట్టి నీ చీర చెరుగులో ధారపోసే అవకాశం జారిపోతుందేమోనని భయమేస్తూ ఉంది.ఎలా!ఎలా!!
********************
నాకింకా స్పష్టంగా గుర్తుంది.మనూరి నుండి మూడుమైళ్ళ దూరం హైస్కూలు. దాదాపు రెండేళ్లుగా మనందరం కలిసే బడికి వెళ్తున్నాం.బడికెళ్లడానికి ఎప్పటిలాగే ఊరి చివర్లో అందరికోసం ఎదురుచూస్తూ ఉంటాం. ఆ రోజు నువ్వూ నీ స్నేహితురాలు తొందరగా వచ్చారోలేక నాకు ఆలస్యమైందో, కాడమల్లె చెట్టుకింద బాసింపట్టు వేసుకుని కూచుని ఉండడం అల్లంత దూరం నుంచి చూశాను. దగ్గరికి వచ్చాక చూసినప్పుడు అబ్బురమనిపించింది.రోజూ కనిపించేదానివే నువ్వు. మరెందుకు ఇవ్వాళ కొత్తగా అనిపిస్తున్నావు? నా దగ్గర జవాబు లేదు. రాత్రంతా మంచు వాన కురిసింది. మంచుతోపాటు ఆకాశంలోని నక్షత్రాలన్నీ రాలి కాడమల్లె చెట్టుకొమ్మల్లో చిక్కుకుని, చలికి వణుకుతూ ఉన్నాయి.రాత్రి రాల్చిన కాడమల్లెలు వొళ్ళో వేసుకుని, కాడలు జత చేసి మాల అల్లుతున్నావు.దగ్గరగా వచ్చిన నన్ను చూసి నవ్వావు. ఆ పలకరింతల నవ్వు పులకింతలు రేపింది. అప్పుడే వీచిన చిరుగాలికి రాలిన మూడు మల్లెలు నీ తలమీద పడి, కదిలి నీ ముక్కును తాకుతూ ఒళ్ళోకి జారాయి. మంచుపూల కళ్ళు పైకెత్తి ఆశ్చర్యంగా చూసిన చూపుల తెల్లదనానికి కాడమల్లెలు తలలు వాల్చాయి.ఆ రోజు మొదలు నిన్ను వీడి నా కాళ్ళు కదలనన్నాయి. వదలనన్నాయి.బడికి పోను మూడు మైళ్ళూ , రాను మూడు మైళ్ళూ మొత్తం ఆరు మైళ్ళు నాకు అరఘడియ అయ్యింది.నా కళ్ళ ముందు నువ్వు నీ స్నేహితురాళ్లతో కలిసి పిల్లబాటన నడిచివచ్చే దృశ్యం, అదృశ్యం కాలేదు. కాదు.నిజం సీతా! నీ పేరు తెలుసుకున్నపుడు నేను రాముడినయ్యాను. మనం వెళ్ళే పిల్ల బాటకి కాపరినయ్యాను. బడికెళ్ళే మన జట్టుకి నాయకుడినయ్యాను.